863 టన్నుల పాప్ కార్న్ తో జేబులు గుల్

Update: 2022-12-19 05:30 GMT
సినిమా టిక్కెట్టుతో పాటు పాప్ కార్న్ ని అద‌నంగా కొనిపించే తెలివైన మ‌ల్టీప్లెక్సుల‌కు కొద‌వేమీ లేదు. ఆన్ లైన్ లో వెబ్ లింకులు షేర్ చేయ‌డంతోనే మ‌ల్టీప్లెక్సులు టికెట్ల అమ్మ‌కాల‌తో పాటు ఫుడ్ ప‌రంగాను బోలెడంత బిజినెస్ చేస్తున్నాయి. ఇక సినీప్రియుల‌కు ఎంతో సుప‌రిచిత‌మైన ఐనాక్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సినీప్రియుల జేబులు గుల్ల చేసే ఫార్మాలాస్ ని అనుస‌రించ‌డంలో ఐనాక్స్ ఘ‌నాపాటి.

దేశవ్యాప్తంగా థియేటర్లు ఉన్న అతి భారీ కార్పొరెట్ సంస్థ ఇది. భారతదేశం అంతటా  వ్యాపారాన్ని నిరంతరం విస్తరిస్తోంది. అయితే ఐనాక్స్ కూడా ఇత‌ర థియేట‌ర్ చైన్ ల మాదిరిగానే కరోనా కాలంలో పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఆ సమయంలో ఉన్న సంక్షోభాన్ని అధిగమించడానికి ఒక పెద్ద మార్పు అవసరం అని భావించి భారతదేశంలోని మరొక అతిపెద్ద థియేటర్ చైన్ దిగ్గజం PVRతో జతకట్టాలని నిర్ణయించుకుంది. థియేట‌ర్ల రంగంలో ఇరు దిగ్గజాలు తమ ఆదాయాన్ని మెరుగుపరచుకోవాలని థియేట‌ర్ల‌ విస్తరణను మ‌రింత వేగంగా పెంచుకోవాలని ప్లాన్ చేశాయి.

INOX విషయానికి వస్తే... సినిమా వీళ్ల‌కు ప్రాథమిక వ్యాపారం. కానీ ఫుడ్ బిజినెస్ లోను పాపులారిటీ ఉంది. సినిమా అనేది చాలా దేశాల్లోని ప్రజలకు ఇష్టమైన వినోద సాధ‌నంగా ఉన్నా.. భారతదేశంలో సినిమాతో పాటు థియేట‌ర్ల‌లో జంక్ ఫుడ్ కి ప్రాధాన్య‌త‌నిస్తారు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్న INOX రెండింటినీ విలీనం చేసి తెలివైన గేమ్ ఆడుతోంది. INOX లీజర్ ప్రస్తుత సంవత్సరంలో 863 టన్నుల పాప్ కార్న్ ని 19.38 లక్షల సమోసాలను.. 82 టన్నుల ఇత‌ర ఆహార పదార్థాల‌ను విక్రయించింది. దీనికి సంబంధించి సినిమా ఫుడ్ రిపోర్ట్ 2022 అనే అధ్యయనం సంచ‌ల‌నంగా మారింది. ఈ రిపోర్ట్ భారతీయ సినిమా థియేట‌ర్ల‌లో ప్రజలు ఎక్కువగా తినడానికి ఇష్టపడే వాటిపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఇది INOXలో 70 మిలియన్ల భారతీయ సినీ ప్రేక్షకుల ఆహార ఎంపికలను బ‌హిర్గ‌తం చేసింది. బెంగుళూరు టెక్కీలు క్రంచీ చిప్స్ వంటి వాటిని ఇష్టపడతారు. భారతదేశంలో INOXలో విక్రయించే మొరుమొరు చిప్ లలో బెంగళూరు వాటా 11.25 శాతం కాగా..చెన్నై- మధురై -సేలం సహా కొన్ని ప్రాంతాల్లో 55 శాతం విక్రయాలు సాగాయి. ఈ ఏరియాల్లోనే మొత్తం 338859 పబ్ (కార్న్ తొట్టె)లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఏకంగా 38.15 లీటర్ల కోక్ అమ్ముడైనట్లు సమాచారం.

ఏడాదిలో సినిమా ప్రేక్షకులు 20.28 లక్షల కప్పుల టీ- కాఫీలు తాగారు. ప్రస్తుత సంవత్సరంలో INOXలో 516958(5.2ల‌క్ష‌లు) శాండ్ విచ్ లు ..286621(2.9ల‌క్ష‌లు) బర్గర్లు కూడా అమ్ముడయ్యాయి. ముఖ్యంగా మధురై సేలం నగరాలు శాండ్ విచ్ వినియోగంలో టాప్ 10లో ఉన్నాయి. లక్నో- గురుగ్రామ్- పూణె- ఢిల్లీ వంటి నగరాలు కూడా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అదే ముంబయి - గురుగ్రామ్ ల‌ను మించి విశాఖపట్నంలో బర్గ‌ర్లు అధికంగా తిన్నార‌ని స‌మాచారం. చైనీస్ జంక్ ఫుడ్ కూడా భారతీయుల ఇష్టమైన ఆహారాలలో ఒకటి. ప్రస్తుత సంవత్సరంలో నూడుల్స్ - ఫ్రైడ్ రైస్  సహా 10.96 లక్షల డిమ్ సమ్ 40000 భోజనాలను థియేట‌ర్ల‌లో తిన్నారు. 2.21 లక్షల మోమోలతో కోల్ కతా అగ్రస్థానంలో ఉండగా 79436 పీసెస్ (రెడీమేడ్ ఫుడ్) తో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది.

హైద‌రాబాద్ కూడా టాప్ లోనే..! ఐనాక్స్ భారతదేశంలోని 74 నగరాల్లోని 167 సినిమా థియేట‌ర్ల‌ల్లో 70 మిలియన్లకు పైగా ప్రేక్షకులను ఈ ఒక్క ఏడాదిలో ఆక‌ర్షించింది. ప్రేక్ష‌కులు 19.38 లక్షల సమోసాలు.. 7.88 మిలియన్ టన్నుల పాప్‌కార్న్ లు కొనుగోలు చేసార‌ని నివేదిక పేర్కొంది. ఐనాక్స్ ముంబై థియేటర్ల‌లో వ్యాపారం స‌హా భారతదేశంలోని 29 నగరాలపై ప‌రిశోధించ‌గా ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూసాయి.  దేశంలోని అన్ని ఐనాక్స్ థియేటర్లలో విక్రయించిన‌ మొత్తం సమోసాలలో దక్షిణాది మెట్రోలు హైదరాబాద్- బెంగళూరు- చెన్నై ల‌లోనే 10.7 శాతం అమ్మ‌కాలు సాగించ‌డం ఆస‌క్తిక‌రం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News