అమీర్ ఖాన్ చెప్పిన ‘బాహుబలి’ ముచ్చట్లు

Update: 2017-10-14 06:15 GMT
‘బాహుబలి’ గురించి బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా మాట్లాడక తప్పని పరిస్థితి నెలకొంది. సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. అమీర్ ఖాన్.. ఇలా ప్రతి స్టారూ ఆ సినిమా గురించి ఏదో ఒక సందర్భంలో మాట్లాడారు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ కలెక్షన్ల ప్రభంజనం సృష్టించాక తమ సినిమాల ప్రమోషన్లకు వచ్చిన ఈ స్టార్లందరికీ ముంబయి మీడియా నుంచే ‘బాహుబలి’ ప్రశ్నలు చాలా ఎదురయ్యాయి. ఇక హైదరాబాద్ వస్తే వాళ్లను ఈ సినిమా గురించి అడక్కుండా ఎలా ఉంటారు. తన కొత్త సినిమా ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన అమీర్.. ‘బాహుబలి’ ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఈ సినిమా గురించి.. రాజమౌళి.. ప్రభాస్ ల గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడాడు అమీర్. తాను ‘బాహుబలి: ది బిగినింగ్’ మాత్రమే చూశానని.. ‘ది కంక్లూజన్’ ఇంకా చూడలేదని అమీర్ చెప్పడం విశేషం.

బాహుబలిని రాజమౌళి అద్భుతంగా తీశాడని.. ఆయన గొప్ప కథకుడని.. అందుకే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ బాహుబలి ఆదరణ పొందిందని అమీర్ అన్నాడు. తాను ‘బాహుబలి: ది బిగినింగ్’ చూశానని.. బాగా నచ్చిందని.. కానీ కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడనే విషయం మాత్రం తనకు తెలియదని.. తాను రెండో భాగం చూడకపోవడమే అందుకు కారణమని అన్నాడు అమీర్. తాను ఈ విషయం ఎవరినీ అడగలేదని.. అడగను కూడా అని.. త్వరలోనే ‘బాహుబలి: ది కంక్లూజన్’ చూసి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటానని అన్నాడు అమీర్. ప్రభాస్ ‘బాహుబలి’గా అద్భుత అభినయం కనబరిచాడని.. అతను తనకు నచ్చాడని అమీర్ చెప్పాడు. మంచి కథ వస్తే తెలుగులోనూ నటిస్తానని.. ఇక్కడి నుంచి ఏదో ఒక రోజు తన దగ్గరికి మంచి కథ వస్తుందనే నమ్మకంతో ఉన్నానని అమీర్ చెప్పడం విశేషం.
Tags:    

Similar News