మూవీ రివ్యూ : అభినేత్రి 2

Update: 2019-05-31 10:27 GMT
చిత్రం : అభినేత్రి 2

నటీనటులు: ప్రభుదేవా - తమన్నా - నందిత శ్వేతా - డింపుల్ హయాతి - కోవై సరళ - సప్తగిరి - సోను సూద్ - అజ్మల్ అమీర్ తదితరులు

సంగీతం : సామ్ సిఎస్

ఛాయాగ్రహణం : ఆయనంక బోస్

ఎడిటింగ్ : అంటోనీ

నిర్మాతలు : అభిషేక్ నామా - ట్రైడెంట్ రవిచంద్రన్

కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : ఎఎల్ విజయ్

మూడేళ్ళ క్రితం తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి విజయం సాధించిన అభినేత్రికి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం డాన్సింగ్ స్ప్రింగ్ ప్రభుదేవా మిల్కీ బ్యూటీ తమన్నాల కాంబినేషన్ వల్ల హారర్ ప్రియుల దృష్టిని అంతో ఇంతో ఆకట్టుకోగలిగింది. ఏకంగా సూర్య ఎన్జికెతో పోటీకి సై అనడంతో కంటెంట్ మీద దర్శక నిర్మాతల ధైర్యానికి ట్రేడ్ సైతం ఇందులో ఎంతో కొంత ఆశించింది. తెలుగు వెర్షన్ మీద మరీ భారీ బజ్ లేకపోయినా ఉన్నంతలో కాసిన్ని అంచనాలతో వచ్చిన అభినేత్రి వాటిని ఏ మేరకు నిలబెట్టుకుందో రివ్యూలో చూసేద్దాం పదండి

కథ:

ఇది అభినేత్రికి కొనసాగింపు. అప్పుడు తన ఇంట్లో తిష్ట వేసిన రూబి దెయ్యం ఇంకా వదల్లెదేమో అని అనుమాన పడిన కృష్ణ(ప్రభుదేవా) ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ చేయించుకుని కూతురు పూజాని తన అమ్మమ్మ ఊళ్ళో వదిలేసి దేవి(తమన్నా)తో కలిసి మారిషెస్ వెళ్ళిపోతాడు. మొదట కొన్ని రోజులు బాగానే ఉన్నా కృష్ణ మరో ఇద్దరు అమ్మాయిలు సారా(నందిత శ్వేతా)ఈశా(డింపుల్ హయాత్) ల వెనుక విడివిడిగా ప్రేమ అంటూ రోమియో వేషాలు వేషాలు పడతాడు.

వీటిని కళ్ళారా చూసి షాక్ తిన్న దేవి అక్కడే పరిచయమైన లేడీ లాయర్(కోవై సరళ)సాయం కోరుతుంది. కొన్ని సంఘటనల తర్వాత అలా ప్రవర్తిస్తోంది కృష్ణ కాదని అతని శరీరంలో ఉన్న అలెక్స్-రంగారెడ్డి అనే రెండు ఆత్మలని తెలుస్తుంది. రాజీ ఫార్ములాతో మీద ఆ దెయ్యాలతో దేవి లాయర్ ఇద్దరు కలిసి ఓ ఒప్పందానికి వస్తారు. అప్పుడే అలెక్స్ రంగారెడ్డిలకు రుద్ర(అజ్మల్ అమీర్)కు ఉన్న కనెక్షన్ బయటపడుతుంది. అసలు రెండు ఆత్మలు కృష్ణను ఎందుకు పూనాయి దేవి తన భర్తను ఎలా కాపాడుకుంది చివరికి ఈ జంట కథ ఎక్కడికి చేరుకుంది అనేది తెరమీద చూడాల్సిందే

కథనం - విశ్లేషణ:

ఈ మధ్య కాలంలో తమిళ సినిమా కొత్త పుంతలు తొక్కుతోందని మంచి క్వాలిటీ ఉన్న కంటెంట్ తో తన స్థాయిని పెంచుకుంటోందని 96 - రట్ససన్ - పరియేరుం పెరుమాళ్ లాంటి క్లాసిక్స్ చూసినప్పుడు మనవాళ్ళు ఇదే అభిప్రాయపడ్డారు. అది తప్పని నిరూపించడానికి ఇవాళ ఎన్జికె అనే ఓ కళాఖండం వస్తే దానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ అభినేత్రి 2 కూడా పోటీ పడింది. మంచి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. డబ్బు ఖర్చు పెట్టే నిర్మాత దొరికాడు. విదేశాలకు సైతం సై అన్నాడు.

ఇంకేముంది ఇవన్ని ఉన్నాయి కదా కథ ఒక్కటీ లేకపోతే ఏమవుతుంది అనుకున్నాడు కాబోలు దర్శకుడు ఎఎల్ విజయ్. అదొక్కటి తప్ప అభినేత్రి 2లో అన్ని సమకూర్చుకున్నాడు. మొదటి భాగం సక్సెస్ కావడానికి చాలా అంశాలు దోహదపడ్డాయి. తమన్నా నడుమో ప్రభుదేవా డాన్సులో దాన్ని హిట్ చేయలేదు. బలమైన ఎమోషన్ పాత్రల మధ్య రిలేషన్ దెయ్యం వెనుక కనెక్ట్ అయ్యే ఫ్లాష్ బ్యాక్ వీటికి మించి ప్రెజెంటేషన్ లో ఉన్న ఫ్రెష్ నెస్ వెరసి ఇవన్ని కూడబలుక్కుని కొన్ని రొటీన్ అంశాలు ఉన్న ఫస్ట్ పార్ట్ ని సూపర్ హిట్ చేశాయి. ఈ ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయి అభినేత్రి 2 కథనాన్ని నడిపించిన తీరు ఎంతటి ఓపిక ఉన్న ప్రేక్షకులకైనా పరీక్ష పెట్టి తీరుతుంది

హీరొయిన్ ని దెయ్యం ఆవహించడం రొటీన్ అయిపోయింది కాబట్టి ఒకటి కాదు ఏకంగా రెండు ఆత్మలను హీరో బాడీలోకి ప్రవేశపెట్టడం అనే పాయింట్ లో నావెల్టీ ఉంది కాని ఆ స్థాయి కొత్తదనం ట్రీట్మెంట్ లో కొరవడింది. నాసిరకం రైటింగ్ తో థియేటర్ మొత్తం లాఫింగ్ గ్యాస్ తో నింపినా నవ్వలేనంత పేలవమైన కామెడీతో సన్నివేశాలు సాగుతుంటే ఎక్కడా కించిత్ ఆసక్తి కూడా కలగకపోవడం విజయ్ తప్పిదమే. కాంచన లాంటి సిరీస్ లు పదే పదే హిట్ అవుతున్నాయంటే కారణం అందులో ఎంత రిపీట్ గా అనిపించినా లారెన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా పవర్ ఫుల్ ఎపిసోడ్స్ రాసుకోవడం.

అంతే తప్ప ప్రభుదేవా తమన్నాలు ఉన్నారు కదా అని అర్థం లేని హారర్ కథను సినిమాగా తీస్తే ఆదరించే ఉదార మనసు ప్రేక్షకులకు ఎందుకు ఉంటుంది. సినిమా ఓపెనింగ్ ని స్ట్రెయిట్ గా పాయింట్ చెప్పడంతో మొదలుపెట్టినా ఆ తర్వాత తాను రాసుకున్న సింగల్ లైన్ కథను రెండు గంటల సేపు ఎలా సాగదీయాలో ఆర్థం కాక లాజిక్ లేని సీన్లను అల్లుకుంటూ పోయినా కనీసం వాటిని కన్విన్సింగ్ గా ఎంగేజింగ్ గా తీసినా మాస్ ఆడియన్స్ అండతో అయినా గట్టెక్కే ఛాన్స్ ఉండేది. ఇందులో ఆ అవకాశం లేదు

మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్దర్ అనేది అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి ఫార్ములా. దీన్ని అత్యద్బుతంగా తెరమీద ఆవిష్కరించిన విక్రమే దాన్ని రిపీట్ చేసినా జనం తిప్పి కొడుతున్నారు. అలాంటిది ప్రభుదేవా లాంటి యాక్టర్ తో ఈ సాహసాన్ని చేయించే ప్రయత్నం చేయించడం నిజం చెప్పాలంటే నవ్వుల పాలైంది. కామెడీ వీక్ గా ఉండటంతో ఒకదశలో తారాగణం సైతం ఏమి చేయాలనీ నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. కృష్ణ శరీరంలో ఉన్నది రెండు ఆత్మలని చెప్పేశాక స్ట్రెయిట్ నేరేషన్ లోకి వెళ్ళకుండా దాన్నో ప్రహసనంగా సాగదీయడం ఎంత మాత్రం అతకలేదు.

ఇవి చాలదు అన్నట్టు సెకండ్ హాఫ్ లో పైత్యం పీక్స్ కు వెళ్ళిపోతుంది. అలెక్స్ రంగారెడ్డి కథలను చెప్పేందుకు అర్జున్ రెడ్డి-గజినీ-నా పేరు సూర్య-ఖుషి స్పూఫ్ లను వాడుకోవడం విజయ్ చీప్ టేస్ట్ కు అద్దం పడుతుంది. ఇవన్ని చాలా కృత్రిమంగా వచ్చాయి. దెయ్యాలు కొంత సేపు కామెడీగా కొంత సేపు సీరియస్ గా ఒక తీరు లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ పోవడం చిరాకును పెంచుతుంది. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే క్లైమాక్స్ లో కన్సర్ట్ పేరుతో తీసిన ఎపిసోడ్ ఏదో గొప్ప ట్విస్ట్ లాగా ఇచ్చిన సోను సూద్ ఎంట్రీ డ్యామేజ్ ని పెంచాయి తప్ప తగ్గించలేదు

ఇక చాలు మహాప్రభో ఇలాంటి సినిమాలు తీయకండి అని పబ్లిక్ ఎంత తిరస్కరిస్తున్నా పేరున్న స్టార్లు ఇలాంటి కథలను ఎంచుకోవడం వింతే. హారర్ కామెడీకి కాలం చెల్లిపోయింది. ఎంత కొత్తగా ఆలోచించినా ఇందులో క్రియేటివిటీని తోడటం కష్టం. ఆ సత్యాన్ని గుర్తించకుండా వైవిధ్యంగా ఆలోచించకుండా విజయ్ లాంటి దర్శకులు చేసే ఇలాంటి ప్రయత్నాలు సదరు ఆర్టిస్టుల మార్కెట్ మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయన్న సత్యం గుర్తిస్తే మంచిది. దానికి ఉదాహరణగా ఇవాళ వచ్చిన వీక్ ఓపెనింగ్స్ ని చూపించవచ్చు. కేవలం డిజిటల్ శాటిలైట్ హక్కుల కోసం వాటి ద్వారా పెట్టుబడి వెనక్కు వస్తోంది కదాని థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని ఓ బ్యాడ్ ఆప్షన్ గా మారుస్తున్న అభినేత్రి 2 లాంటి సినిమాలకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో కాలమే సమాధానం చెప్పాలి

నటీనటులు:

ప్రభుదేవా తన శాయశక్తులా మూడు షేడ్స్ ఉన్న పాత్రలను నిలబెట్టే ప్రయత్నం గట్టిగా చేశాడు. ఐదు పదుల వయసులోనూ అంత చలాకీగా పాతికేళ్ళ యువకుడిగా స్టెప్స్ వేసే తీరుకి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కృష్ణ అలెక్స్ రంగారెడ్డిలుగా ఒదిగిపోయిన తీరు బాగానే అనిపిస్తుంది కాని ఎందుకో ఒకరకమైన అసహజత్వం తనలో కనిపించింది ముఖ్యంగా క్లైమాక్స్ లో ఏదో మొక్కుబడిగా నటించాలన్న తీరులో చాలా నిరాసక్తంగా కనిపించాడు.

తమన్నా బాగుంది. ఓ బేబీ పాటలో రెచ్చిపోయి అందాలు ఆరబోసి మాస్ కి కొంత ఊరట కలిగించింది. అక్కడక్కడా కొంత ఓవర్ అనిపించినా ఎయిర్ పోర్ట్ సీన్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. నందిత శ్వేతా మేకప్ ఎక్కువ నటన తక్కువ రీతిలో సాగిపోయింది. డింపుల్ హయత్ కు రెండు తక్కువైపోయాయి. అతి చేయకపోతే తీసుకోమని దర్శకులు ముందే చేబుతున్నరేమో కోవై సరళ ప్రతి సినిమాకు డోస్ పెంచుకుంటూ పోతున్నారు. సప్తగిరి కామెడీ అతకలేదు. అజ్మల్ అమీర్ విలనీ పరమ రొటీన్. సోను సూద్ రెండు సీన్లకే పరిమితం. వీళ్ళు తప్ప ఇంకెవరు గుర్తున్నా మనకు మంచి మెమరీ ఉన్నట్టే

సాంకేతిక వర్గం:

దర్శకుడు విజయ్ సరైన హోం వర్క్ లేకుండా హారర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి బ్యాడ్ ఎగ్జాంపుల్ గా అభినేత్రి 2ని తీర్చిదిద్దాడు. ఒకప్పుడు మంచి టేకింగ్ తో పేరు తెచ్చుకున్న ఇతను ఇప్పుడిలా మూసలో పడిపోవడం వింతే.  గతంలో వచ్చిన ఎన్నో దెయ్యం సినిమాల కలబోతగా దీన్ని తీర్చిదిద్దిన తీరుకు ప్రేక్షకులే కాదు ఆర్టిస్టులూ బలయ్యారు. ఇంత కన్నా ఎక్కువ చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. సామ్ సిఎస్ సంగీతం హోరులో కొట్టుకుని పోయింది. ఒక్క పాట కనీస స్థాయిలో లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రమే. అంతా మొక్కుబడిగా సాగుతుంది.

అంటోనీ ఎడిటింగ్ సెకండ్ హాఫ్ ని బాగా దెబ్బ కొట్టింది. అయనంక బోస్ ఛాయాగ్రహణం కొంతవరకు నయం. రాజీ పడిన నిర్మాణాన్ని రిచ్ గా చూపించే ప్రయత్నం చేసింది. ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే మారిషస్ ఇంట్లో తీసిన ఇన్ డోర్ షూటింగ్ తప్ప పెద్దగా ఖర్చు పెట్టినట్టు కనిపించదు. ఈ కథకు ఇదే ఎక్కువ అనుకున్నారో ఏమో క్లైమాక్స్ లో పెద్ద బిల్డప్ ఇచ్చిన మ్యూజిక్ కన్సర్ట్ ని కూడా చాలా చీప్ గా చుట్టేసి మమ అనిపించారు. మొత్తానికి హారర్ ప్రియులను కూడా ఇలాంటి సినిమాలంటే భయపడే రేంజ్ లో ఉంది అభినేత్రి 2

చివరిగా - అభినేత్రి 2 : అర్థం లేని దెయ్యాల గోల

రేటింగ్ : 1.5 / 5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News