CHIRU 152 టైటిల్ లీక్ వెన‌క అంత ప్లాన్ ఉందా?

Update: 2020-03-02 06:10 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 152వ సినిమా టైటిల్ లీక్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్. ఓ పెద్ద ఫంక్ష‌న్ ఏర్పాటు చేసి కొర‌టాల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్ర‌క‌టిస్తార‌ని భావిస్తే చిరు పుసుక్కున నోరు జారారు. `ఓ పిట్ట క‌థ‌` ఈవెంట్లో చిరు స్వ‌యంగా `ఆచార్య` టైటిల్ ని క‌న్ఫామ్ చేసేయడం షాకిచ్చింది. అయితే ఆయ‌న ఇలా ఎందుకు చేశారు? అంటే దానివెన‌క ఓ అనూహ్య కార‌ణం ఉంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇటీవ‌ల టైటిల్ వివాదాలు పెద్ద త‌ల‌నొప్పిగా మారాయి. 2019లో వ‌రుస‌గా నాలుగైదు సినిమాల టైటిళ్ల విష‌యంలో జ‌రిగిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. చివ‌రి నిమిషంలో టైటిల్ మార్పుతో రిలీజ్ చేసుకోవాల్సిన స‌న్నివేశం త‌లెత్తింది. మేం ఇదివ‌ర‌కెపుడో టైటిల్ ని రిజిస్ట‌ర్ చేయించేసాం అంటూ సినిమా తీయ‌క‌పోయినా టైటిల్ పై బిజినెస్ లు చేసే నిర్మాత‌ల‌తోనూ కొన్ని చిక్కులొచ్చిప‌డుతున్నాయి. ఇదొక్క‌టే కాదు `సైరా - న‌ర‌సింహారెడ్డి` రిలీజ్ ముందు గ‌డ‌బిడ కూడా ఎంతో ఆలోచింప‌జేసింది. అందుకే మెగాస్టార్ చిరంజీవి తెలివిగా టైటిల్ మ్యాట‌ర్ పై ముందే హింట్ ఇచ్చేశారు.

మెగాస్టార్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించి చేస్తున్న ఈ సినిమా విష‌యం లో వివాదేలేవైనా త‌లెత్తుతాయ‌నే కావాల‌నే ముందుగానే టైటిల్ ని రివీల్ చేసి ఇది మాది అని హోల్డ్ చేసే ప్ర‌య‌త్నం చేసారా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆచార్య (చిరు 152) చిత్రం పూర్తిగా రాజ‌కీయాంశాల‌తో ముడిప‌డిన‌ది. ఇందులో క‌థ ప‌రంగా వివాదాంశాల్ని ట‌చ్ చేస్తున్నార‌న్న లీకులు ఇప్ప‌టికే అందాయి. దేవాదాయ శాఖ భూముల గోల్ మాల్ ని ట‌చ్ చేస్తున్నార‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. ఇలాంట‌ప్పుడు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు కావాల‌నే ఏదో ఒక వివాదం క్రియేట్ చేసే వీలుందని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌.

మెగాస్టార్ చిరంజీవి ఇప్ప‌టికే మూడు రాజ‌ధానులకు మ‌ద్దతు తెలిపారు. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అమ‌రావ‌తి రాజ‌ధానికి స‌పోర్ట్ చేస్తుంటే చిరు మాత్రం పూర్తిగా వై.య‌స్. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యానికే మ‌ద్ధ‌తు తెలిపారు. ఇక వైజాగ్ (ఏపీ)లో టాలీవుడ్ అభివృద్ధి పై జ‌గ‌న్ తో మంత‌నాలు సాగించారు. ఇలాంటి ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అమ‌రావ‌తి ఫాలోవ‌ర్స్.. రాజ‌కీయ నాయ‌కులు చిరంజీవి పై కాస్త నెగిటివ్ గా ఉన్నారు. ఆ వేడిలో చిరు ఇంటిని ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రిక‌లు సైతం జారీ చేశారు. దీంతో తెలంగాణ పోలీసులు ఆదివారం చిరు ఇంటి ప్రాంగ‌ణం వ‌ద్ద‌ పోలీసుల్ని మోహ‌రించాల్సి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఇదే ఆదివారం రోజున ఆచార్య (చిరు 152) టైటిల్ ని రిలీజ్ చేయ‌డం ప‌లు సందేహాలకు తావిస్తోంది.
Tags:    

Similar News