నిజమేనా.. శ్రీమంతుడికి యాడ్ చేస్తున్నారా?

Update: 2015-08-13 18:25 GMT
స్క్రిప్టు రాస్తున్నపుడు.. షూటింగ్ చేస్తున్నపుడు ప్రతి సన్నివేశమూ చాలా ముఖ్యమైంది లాగే అనిపిస్తుంది. కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గరికొచ్చేసరికి గందరగోళం మొదలవుతుంది. నిడివి పెరిగిపోతే అదే సినిమాకు పెద్ద మైనస్ అయ్యేు ప్రమాదముంటుంది కాబట్టి.. తాను ఎంతో ఇష్టంగా తీసిన సన్నివేశాల్లో కొన్నింటిని డైరెక్టర్ పక్కనబెట్టక తప్పదు. ఐతే అలా పక్కనబెట్టేసిన సన్నివేశాల్ని మళ్లీ ప్రేక్షకులకు చూపిస్తే బాగుంటుందన్న కోరిక కొంతమంది డైరెక్టర్లకు ఉంటుంది. ‘మిర్చి’ సినిమా విషయంలో డైరెక్టర్ కొరటాల శివ ఇలాంటి ప్రయోగమే చేశాడు. ఎడిటింగ్ లో తీసి పక్కన పెట్టేసిన వర్షం ఫైట్ ను సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత యాడ్ చేయించాడు. భారీగా ఖర్చు పెట్టి తీసిన ఆ ఫైట్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.

కొరటాల రెండో సినిమా ‘శ్రీమంతుడు’ ఎడిటింగ్ చేస్తున్నపుడు కూడా కొన్ని మంచి సన్నివేశాల్ని పక్కనబెట్టేసినట్లు వార్తలొచ్చాయి. అవి జగపతి, మహేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలని.. వీటిని కట్ చేసినందుకు జగపతి ఫీలయ్యాడని కూడా చెప్పుకున్నారు. ఐతే ‘శ్రీమంతుడు’ ప్రస్తుతం మంచి టాక్ తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘మిర్చి’ తరహాలోనే కొన్ని సన్నివేశాల్ని యాడ్ చేయాలని కొరటాల ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీని గురించి మీడియా వాళ్లు ప్రశ్నిస్తే.. ‘‘పక్కనబెట్టేసిన సన్నివేశాల్ని యాడ్ చేమొచ్చు కదా అని మా యూనిట్ వాళ్లే అడుగుతున్నారు. అందుకే ముందు నేను వెళ్లి ఎడిటర్ తో కూర్చొని ఓ సారి చర్చించి.. ఆ తర్వాత డిసైడ్ అవుతాం. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తాం’’ అని చెప్పాడు కొరటాల. ఐతే మిర్చి సినిమా లెంగ్త్ మరీ ఎక్కువేమీ కాదు కాబట్టి..  రెయిన్ ఫైట్ యాడ్ చేసినా ఇబ్బంది లేకపోయింది. కానీ ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న ‘శ్రీమంతుడు’ నిడివి 2 గంటల 43 నిమిషాలే. మామూలు సినిమాలతో పోలిస్తే ఈ నిడివి ఎక్కువే. మళ్లీ కొత్త సన్నివేశాలు కలిపితే ప్రేక్షకులు ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు.
Tags:    

Similar News