బాత్రూమ్ లో న‌టుడి మృతి.. డ్ర‌గ్స్ అతిగా సేవించి..!?

Update: 2023-05-22 19:35 GMT
హిందీ చిత్ర‌ ప‌రిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతోంది. ఎన్సీబీ విచార‌ణ‌లో ఇప్ప‌టికే ప‌లువురు న‌టీన‌టులు డ్ర‌గ్స్ తీసుకుంటున్నార‌ని క్ర‌య‌విక్ర‌యాలు సాగిస్తున్నార‌ని ప్రూవైంది. అరెస్టుల ఫ‌ర్వంతో పాటు దీనిపై తీవ్ర‌మైన చ‌ర్చ కూడా సాగింది. అదే డ్ర‌గ్ ఇప్పుడు ఒక వ‌ర్థ‌మాన న‌టుడి ప్రాణం తీసింది. అతిగా డ్ర‌గ్స్ పుచ్చుకుని బాత్రూమ్ లో ఉండ‌గానే స‌ద‌రు న‌టుడు మ‌ర‌ణించడం సంచ‌ల‌న‌మైంది. ఇంత‌కీ ఎవ‌రా న‌టుడు? అంటే...

పాపుల‌ర్ రియాలిటీ షో `స్ప్లిట్స్‌విల్లా 9` ఫేమ్ ఆదిత్య సింగ్ రాజ్ పుత్ డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా బాత్రూంలో చనిపోయాడని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో పోలీసులు వెల్ల‌డించారు. ఇంకా దీనిపై విచారణ జరుగుతోంద‌ని ముంబై పోలీసులు తెలిపారు. నటుడు- మోడల్ -ఫోటోగ్రాఫర్ అయిన ఆదిత్య సింగ్ రాజ్ పుత్ మే 22న తన అంధేరీలోని ఇంటి బాత్ రూమ్ లో శవమై కనిపించాడు. అతని అపార్ట్ మెంట్ లో స్నేహితుడు దీనిని గమనించి వాచ్ మెన్ తో కలిసి అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అత‌డు చనిపోయాడని డాక్ట‌ర్లు ధృవీక‌రించారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామని దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు.

ఇది డ్రగ్ ఓవర్ డోస్ కావచ్చు! అంటూ పోలీసులు ప్రాథ‌మికంగా ఒక అంచ‌నాకి వ‌చ్చారు. అయితే  అత‌డి ఇన్ స్టాగ్రామ్ ని ప‌రిశీలిస్తే అతను తన స్నేహితులతో కలిసి గత రాత్రి ఇంట్లోనే ఉన్నట్లు సూచ‌న‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆదిత్య స్నేహితుడు సబ్యసాచి సత్పతి ఈ మరణంపై తన స్పందనను పంచుకున్నారు.. డ్రగ్ ఓవర్ డోస్ అంటూ వార్తలు వస్తున్నాయి. నేను అతని స్నేహితుడినే కానీ నేను ఒడిశాలో ఉన్నప్పటి నుండి అతనితో టచ్ లో లేను. మేము కలుసుకుని మాట్లాడి దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు అవుతోంది. విచారణ సాగుతోంది. బహుశా అతను బాత్రూంలో పడిపోయినప్పుడు అతని తల నేల‌కు బలంగా కొట్టుకుని ఉండవచ్చు.. అని సందేహం వ్య‌క్తం చేసాడు.

ఆదిత్య కెరీర్ గురించి ప్ర‌శ్నించ‌గా.. ``అత‌డు బాగా కెరీర్ లో రాణిస్తున్నాడు. అతని బ్రాండ్ విలువ బాగానే ఉంది. అతడికి ఉన్న వెబ్ సైట్ నుండి ప్రజలు కొనుగోళ్లు చేస్తున్నారు. అతను టీవీ ప‌రిశ్ర‌మ‌లో పెద్దగా ప‌ని చేయడం లేదు కానీ అతని బ్రాండ్ కిక్ ఆఫ్ అయ్యింది అని తెలిపారు.

Similar News