మ‌గాళ్లు చెత్త‌ ఫోటోలు షేర్ చేస్తే నా అకౌంట్ బ్లాక్..!

Update: 2022-06-24 07:32 GMT
గాయ‌ని చిన్మయి శ్రీపాద ఏవిష‌యంపైనైనా ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రిస్తారు. సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాలను కుండ‌బ‌ద్ద‌లు గొట్టి మ‌రీ చెబుతారు. అప్ప‌ట్లో 'మీటూ ఉద్య‌మం'పై శ్రీపాద చేసిన పోరాటం దేశ వ్యాప్తంగా ఎంత చ‌ర్చకు దారి తీసిందో తెలిసిందే. ఆ క్ర‌మంలో ప్ర‌శంస‌ల‌తో పాటు..విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు. ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు స‌రికాద‌ని  కొంత మంది నెటిజ‌నులు తీవ్రంగానే ఖండించారు.

ఆ క‌థ ముగిసిన త‌ర్వాత  సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తీసారి  స్త్రీవాద భావాలను ధైర్యంగా  వ్య‌క్త‌ప‌ర‌చ‌డం మొద‌లైంది. ఇప్ప‌టికీ అది కొన‌సాగుతుంది. మహిళలు ఎదుర్కొనే సమస్యలపై నిక్కచ్చిగా మాట్లాడే చిన్మయి సూచనల కోసం పలువురు ఆమెతో చర్చించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్మయి ట‌చ్ లోకి రాక‌పోవ‌డంతో  ఆమె తల్లికి ఫోన్లు చేయడం ప్రారంభించారు.

ఈ క్ర‌మంలో తన తల్లి కొన్ని ర‌కాల ఇబ్బందుల‌కు గుర‌య్యారు. తన వల్ల.. తన తల్లికి సమస్యలు వస్తున్నాయని.. ఫోన్లు చేస్తూ ఆమెను పలువురు విసిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్ర‌మంలో చిన్మ‌యిని కొంత మంది ఆక‌తాయిలు వ్య‌క్తిగ‌తంగాను టార్గెట్ చేసినేట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. చిన్మ‌యి ఇన్ స్టా..ట్విట‌ర్ ఖాతాకి పురుషులు 'అగ్లీ' చిత్రాలను పంపించి వేధింపుల‌కు దిగుతోన్న విష‌యంలో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వ‌స్తోంది.

ఇన్నాళ్లు విష‌యాన్ని గోప్యంగా ఉంచిన చిన్మ‌యి ఈ విష‌యాన్ని రివీల్ చేసింది. ఆ కార‌ణంగానే ఇన్ స్టా..ట్విట‌ర్ ఖాతాలు బ్లాక్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి మీటూ ఉద్య‌మంపై శ‌మ‌ర శంఖం పూరించిన నాటి నుంచి ఇలాంటి వేధింపుల‌కు చిన్మ‌యి గుర‌వుతున్నారు.

కోలీవుడ్ ఇండ‌స్ర్టీలో కొంత మంది ప్ర‌ముఖుల పేర్ల‌ను తెర‌పైకి తీసుకురావ‌డంతో వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌భ్య పోస్టులు పెడుతున్నార‌ని గ‌తంలోనే చిన్మ‌యి ఆరోపించింది.

కానీ కాల‌క్ర‌మేణా ఆక‌తాయిలు పెట్రేగిపోవ‌డంతో ఏకంగా సోష‌ల్ మీడియా ఖాతాల్నే బ్లాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. చిన్మ‌యి ఇటీవ‌లే కవ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇదే సంద‌ర్భంగా మ‌రోసారి మానసికంగా దెబ్బ తీయ‌డానికి ఇలాంటి చెత్త పోస్ట్ లు పెడుతున్న‌ట్లు ఆమె అభిమానులు  మండిప‌డుతున్నారు. వాటిని ప‌ట్టించుకోకుండా మాతృత్వాన్ని ఆస్వాదించాల‌ని ..ఆమెకు అండ‌గా నిల‌బ‌డుతున్నారు.
Tags:    

Similar News