'పుష్ప 2'.. కాంట్రవర్సీ అవుతున్నా కలెక్షన్స్ మాత్రం తగ్గేదేలే!
'పుష్ప 2: ది రూల్' చిత్రం హిందీలో 16 రోజుల్లో 645 కోట్ల నెట్‌ని వసూలు చేసింది. బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ₹1500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. మూడో వారంలోనూ పుష్పగాడి రూల్ స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు స్టేట్స్ లోనే కాదు, నార్త్ ఇండియా నుంచి నార్త్ అమెరికా వరకూ ఈ సినిమా అనూహ్య వసూళ్లు రాబడుతోంది. చూస్తుంటే మరికొన్ని రోజులు ఈ హవా ఇలానే కొనసాగేలా ఉంది.
'పుష్ప 2' సినిమా ఘన విజయం సాధించినప్పటికీ, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో పెద్ద వివాదంలో చిక్కుకుంది. అది ఇప్పుడు చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. కేసు కోర్టులో ఉన్నప్పటికీ స్వయంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా హీరో అల్లు అర్జున్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత బన్నీ ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వెంటనే మంత్రులు, పోలీసు అధికారులు రంగంలోకి దిగి హెచ్చరికలు జారీ చేయటం జరిగింది.
ఇదే క్రమంలో ఓయూ జేఏసీ పేరుతో కొందరు వ్యక్తులు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి చేశారు. దాడిని ఖండిస్తూ #StopCheapPoliticsOnALLUARJUN అంటూ నెటిజన్లు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా 'పుష్ప 2' వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. కొత్త సినిమాలు రిలీజైనా సరే, థర్డ్ వీకెండ్ లోనూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. ఆంధ్ర, నైజాం, యూఎస్, నార్త్ మార్కెట్ లలో మంచి పనితీరును కనబరిచింది.
'పుష్ప 2: ది రూల్' చిత్రం హిందీలో 16 రోజుల్లో 645 కోట్ల నెట్‌ని వసూలు చేసింది. బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మూడో ఆదివారం హిందీలో ₹25 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బుక్ మై షోలో ఇప్పటివరకు 17.5 మిలియన్లకు పైగా టిక్కెట్ బుకింగ్స్ తో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. న్యూ ఇయర్ మాత్రమే కాదు, సంక్రాంతి సీజన్ వరకూ ఈ సినిమా ఇదే హవా కొనసాగించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే 'బాహుబలి 2' హయ్యెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది.
సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో 'పుష్ప 2: ది రూల్' సినిమా తెరకెక్కింది. ఇందులో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఫహాద్ పాజిల్, రావు రమేష్, జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు.