టాలీవుడ్ డ్రగ్స్ కేసు..ఆయన వాదన వినండి

Update: 2017-07-22 07:48 GMT
టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్‌కు సంబంధించి వారం పది రోజుల నుంచి రకరకాల చర్చలు చూస్తున్నాం. అనేక రకాల అభిప్రాయాలు వింటున్నాం. ఈ కేసుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నేత.. లాయర్ కూడా అయిన రఘునందన్ రావు ఓ టీవీ ఛానెల్ చర్చలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన ఈ కేసు విషయంలో కొన్ని విమర్శలూ చేశారు. ఆ విమర్శల్ని పక్కన పెడితే.. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆయన చెప్పిన కొత్త కోణాల గురించి ఆలోచించాల్సిందే.

డ్రగ్స్ కేసును విచారిస్తున్న అకున్ సబర్వాల్ తీరు సరిగా లేదంటున్నారు రఘునందన్ రావు. ఎంతసేపూ ఆయనకు పబ్లిసిటీ మీదే దృష్టి ఉందని.. సైలెంటుగా కేసును విచారించకుండా ప్రతి దాంట్లోనూ మీడియాను ఇన్వాల్వ్ చేస్తూ.. మీడియాకు లీకులిస్తూ.. మీడియా మైకుల ముందు మాట్లాడుతూ హడావుడి చేస్తున్నారని ఆయనన్నారు. సినీ ప్రముఖులు ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువైతే వాళ్ల మీద కేసులు పెట్టడానికి అవకాశం ఉండదని.. డ్రగ్స్ తీసుకుంటున్నందుకు వాళ్లు బాధితులు అవుతారు తప్ప నిందితులు కారని.. వాళ్లను తీసుకెళ్లి రీహాబిలిటేషన్ చేయించాల్సిన బాధ్యత పోలీసులదే అని రఘునందన్ అన్నారు.

డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న వారి రక్త నమూనాలు సేకరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారని.. ఐతే వాటిని సరిగ్గా పరీక్షించి డ్రగ్స్ వాడారో లేదో తేల్చే సాంకేతిక నైపుణ్యం మన దగ్గర లేదని ఆయన చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ ఒకటే ఉందని.. అక్కడ పరీక్షల కోసం వందల కొద్దీ  కేసులు పెండింగులో ఉన్నాయని.. డ్రగ్స్ కేసుకు సంబంధించిన నమూనాల ఫలితాలు ఎప్పటికొస్తాయో.. సరిగ్గా వస్తాయో లేదో కూడా తెలియదని ఆయనన్నారు. దేశంలో ఉత్తరాదిన ఉన్న ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రామాణికమైందిగా చెబుతారని.. రెండేళ్ల కిందట ‘ఓటుకు నోటు’ కేసులో దొరికిన ఆడియో టేపుల్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతేనా అన్నది ఇక్కడి ల్యాబ్‌లో తేల్చలేకపోవడంతో అక్కడికి పంపారని.. అక్కడి నుంచి కూడా ఇప్పటిదాకా ఫలితాలు రాలేదని.. అలాంటిది డ్రగ్స్ కేసు వ్యవహారం ఏమవుతుందో ఊహించడం కష్టమేమీ కాదని రఘునందన్ చెప్పారు.

డ్రగ్స్ కేసులో స్కూల్ యాజమాన్యాలకు అకున్ సబర్వాల్ ఇప్పటిదాకా నోటీసులే ఇవ్వలేదని.. పబ్లిసిటీ కోసమని ఫిలిం సెలబ్రెటీల్ని విచారిస్తూ.. షో పుటప్ చేస్తున్నారని.. ఇకనైనా ఇది ఆపాలని ఆయన అన్నారు. మియాపూర్ భూ కుంభకోణం నుంచి దృష్టి మళ్లించడానికే ఈ డ్రామా నడుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News