చుట్టు తిరిగి రవితేజ వద్ద ఆగిన క్రేజీ డైరెక్టర్‌

Update: 2019-05-11 05:34 GMT
రామ్‌ గోపాల్‌ వర్మ శిష్యుడైన అజయ్‌ భూపతి తన మొదటి సినిమా 'ఆర్‌ ఎక్స్‌ 100'తో అందరి దృష్టిని ఆకర్షించాడు. మొదటి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈయనకు పలువురు యువ హీరోలు టచ్‌ లోకి వచ్చారనే వార్తలు వచ్చాయి. అజయ్‌ భూపతి దర్శకత్వంలో సినిమా చేసేందుకు పలువురు యువ హీరోలు ఆసక్తిగా ఉన్నారని, అజయ్‌ భూపతి దశ తిరిగిందంటూ ప్రచారం జరిగింది. అయితే అజయ్‌ భూపతి సంవత్సర కాలంగా తన తర్వాత సినిమాను మొదలు పెట్టకుండా మీన మేషాలు లెక్కిస్తూ వస్తున్నాడు.

ఇప్పటికే అజయ్‌ భూపతి రెండవ సినిమా 'మహా సముద్రం' అని తేలిపోయింది. టైటిల్‌ చాలా డెప్త్‌ గా ఉండటంతో తప్పకుండా ఇది మాస్‌ ఆడియన్స్‌ కు కనెక్ట్‌ అయ్యేలా ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. మొదట ఈ చిత్రంను బెల్లంకొండ శ్రీనివాస్‌ తో చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అంతుకు ముందు కూడా ఈ కథను పలువురు హీరోలకు చెప్పాడనే టాక్‌ వినిపించింది. రామ్‌, నితిన్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, నాగ చైతన్య ఇంకా కొందరు యువ హీరోలు ఈ ప్రాజెక్ట్‌ పై ఆసక్తి చూపించారని, వారితో చర్చలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. కాని ఏ ఒక్కటి నిజం కాదని తేలిపోయింది.

అజయ్‌ భూపతి అందరి వద్దకు తిరిగి చివరకు మాస్‌ రాజా రవితేజ దగ్గరకు వచ్చి ఆగినట్లుగా తెలుస్తోంది. మహాసముద్రం స్క్రిప్ట్‌ రవితేజకు బాగా నచ్చిందని, ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో ఇది చేస్తే తప్పకుండా వర్కౌట్‌ అవుతుందనే నమ్మకంను రవితేజకు దర్శకుడు కల్పించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మద్య చర్చలు జరుగుతున్నాయని, రవితేజ ప్రస్తుత కమిట్‌ మెంట్స్‌ పూర్తి అయిన వెంటనే మహాసమద్రం కు ఎంటర్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై దర్శకుడు అజయ్‌ భూపతి నుండి క్లారిటీ రావాల్సి ఉంది.
Tags:    

Similar News