కేసీఆర్ స‌ర్కారుపై అక్బ‌రుద్దీన్ ఫైర్

Update: 2017-11-07 09:48 GMT
మ‌జ్లిస్ వ్య‌వ‌హారం కాస్త విచిత్రంగా ఉంటుంది. మిత్రుడిగా ఉంటూనే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌టంలో వారికి వారే సాటి. అధికార‌ప‌క్షానికి ద‌గ్గ‌ర‌గా ఉంటూ.. వారికి అండ‌గా ఉంటున్న‌ట్లే ఉంటూ.. టైం చూసి చుర‌క‌లు వేయ‌టంలో మ‌జ్లిస్ నేత‌ల తీరే వేరుగా ఉంటుంది. కేసీఆర్ స‌ర్కారుకు అప్ర‌క‌టిత మిత్రుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌జ్లిస్ ప‌ట్ల అంతే స్నేహ‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారు కేసీఆర్‌.

తొంభై స్థానాలు ప‌క్కా.. కాస్త క‌ష్ట‌ప‌డితే వంద‌కు పైనే గెలుస్తామ‌ని ధీమాగా చెప్పే కేసీఆర్ సైతం.. మ‌జ్లిస్ అడ్డాలో గులాబీ జెండా ఎగుర‌వేస్తామ‌నే మాట‌ను మాట వ‌ర‌స‌కు కూడా అన‌టం క‌నిపించ‌దు. ఇంత జాగ్ర‌త్త‌గా ముఖ్య‌మంత్రి ఉన్నా.. టైం చూసుకొని మ‌రీ చెల‌రేగిపోవ‌టం మ‌జ్లిస్ ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్‌ కు అల‌వాటు.

తాజాగా ఆయ‌న త‌న నోటికి ప‌ని పెట్టారు. తెలంగాణ అసెంబ్లీలో నెల‌కొన్న ర‌గ‌డ‌పై ఆయ‌న స్పందించారు. స‌భ‌ను నిర్వ‌హించే విష‌యంలో తెలంగాణ స‌ర్కారు అనుస‌రిస్తున్న తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టిన ఆయ‌న‌.. స‌భ న‌డుస్తున్న తీరు అప్ర‌జాస్వామికంగా ఉంద‌న్నారు. స‌భ్యులు గొడ‌వ చేస్తున్నా స‌భ‌ను న‌డ‌ప‌టం స‌రికాద‌న్నారు.

స‌భ్యులు ఆందోళ‌న చేస్తూ.. గంద‌ర‌గోళం సృష్టిస్తున్నా ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఇలాంటి స‌భ‌లో తాము ఉండ‌లేమ‌న్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని స్పీక‌ర్ కాపాడాల‌ని కోరిన అక్బ‌రుద్దీన్‌.. బీజేపీని చూసి ప్ర‌భుత్వం ఎందుకు భ‌య‌ప‌డుతుంద‌న్న ప్ర‌శ్న‌ను సంధించారు. స‌భ ఆర్డ‌ర్ లేని స‌మ‌యంలో అయితే వాయిదా వేయ‌టం కానీ.. లేదంటే స‌భ‌ను స‌జావుగా న‌డిచేలా చేయ‌టం లాంటివి చేయాల‌న్నారు. మిత్రుడే అయినా.. టైం చూసి చెల‌రేగిపోయాడుగా?

Tags:    

Similar News