ఈ వారం ఓటీటీలో మాస్ జాతర..!

Update: 2022-01-20 15:11 GMT
కరోనా నేపథ్యంలో పెద్ద సినిమాలన్నీ వాయిదా పడటంతో.. ఏమాత్రం క్రేజ్ లేని రెండు మూడు చిన్న సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. దీంతో సంక్రాంతి సందర్భంగా వచ్చిన 'బంగార్రాజు' సినిమానే ఈ వీకెండ్ లోనూ బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ వారం ఓటీటీలో డైరెక్ట్ ఓటీటీ రిలీజులు కూడా ఏమీ లేవు. కాకపోతే 'లూజర్ 2' అనే వెబ్ సిరీస్ తో పాటుగా 'అఖండ' - 'శ్యామ్ సింగరాయ్' వంటి రెండు సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీ ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అయ్యాయి.

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ''అఖండ''. డిసెంబర్‌ లో మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. 100కు పైగా కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శిమతమైంది. అఘోరగా బాలయ్య నటన - థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ - బోయపాటి టేకింగ్ ఈ సినిమా విజయానికి కారణమయ్యాయి. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా.. శ్రీకాంత్ - పూర్ణ - జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో అఖండమైన సక్సెస్ సాధించిన ఈ యాక్షన్ అండ్ మాస్ మసాలా మూవీ.. ఇప్పుడు ఓటీటీలో మాస్ జాతరకు సిద్ధమైంది. రేపు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డిస్నీ+ హాట్‌ స్టార్‌ లో 'అఖండ' ప్రసారం కానుంది.

నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''శ్యామ్ సింగ రాయ్''. ఇందులో సాయి పల్లవి - కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. క్రిస్మస్ సందర్భంగా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టింది. దేవాదాసి వ్యవస్థ మీద ఫైట్ చేసే శ్యామ్‌ సింగరాయ్‌ గా నాని.. దేవదాసిగా సాయి పల్లవి అద్భుతమైన పెరఫార్మెన్స్.. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా గురువారం అర్థరాత్రి 12 గంటలకు నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీలో ప్రీమియర్ ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది.   

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ప్రియదర్శి - శశాంక్ - కల్పిక - అని - పావని గంగిరెడ్డి - కోమలి ప్రసాద్ - షాయాజీ షిండే - ధన్యా బాలకృష్ణ - హర్షిత్ - శిశిర్ శర్మ - తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ''లూజర్ 2''. ఇది సక్సెస్ ఫుల్ 'లూజర్' సిరీస్ కు సీక్వెల్. అభిలాష్ రెడ్డి & శ్రవణ్ మాదాల ఈ ఒరిజినల్ కు దర్శకత్వం వహించారు. జీ5 ఓటీటీలో రేపటి నుండి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ వారం ఓటీటీలోకి వస్తున్న ఏ కంటెంట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందో చూడాలి.
Tags:    

Similar News