అఖిల్ కన్ను అతడిపై పడిందా?

Update: 2015-10-20 05:59 GMT
దాదాపు ఏడాది తర్జన భర్జన తర్వాత హీరోగా తన తొలి  సినిమాను వీర మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో చేశాడు. ఆ సినిమా పూర్తయింది. ఇంకొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి అక్కినేని కుర్రాడి రెండో సినిమా సంగతేంటి? తన రెండో సినిమాను ఎవరితో చేస్తాడు? అందరిలోనూ ఇదే ఆసక్తి. ఓ సినిమా విడుదలయ్యాక నెమ్మదిగా ఇంకో సినిమా గురించి ఆలోచించే రోజులు కావివి. ఓ సినిమా పూర్తి కాకముందే ఇంకో దానికి రంగం సిద్ధం చేసేయాలి. కాకపోతే ఇప్పుడే తొలి సినిమా చేస్తున్నాడు, పైగా దాని కోసం బాగా కష్టపడ్డాడు కూడా కదా.. అందుకే కాస్త ఆచితూచి అడుగేస్తున్నట్లున్నాడు.

కొన్ని రోజుల కిందటి వరకు అఖిల్ రెండో సినిమా దర్శకులుగా కొందరి పేర్లు వినిపించాయి. ముందు కొరటాల శివతో అన్నారు. అఖిల్-కొరటాల కాంబినేషన్ సెట్ చేయడానికి బండ్ల గణేష్ ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ కుదర్లేదు. కొరటాల ఎన్టీఆర్ తో సినిమాకు రెడీ అయిపోయాడు. ఆ తర్వాత శ్రీను వైట్ల పేరెత్తారు. కానీ ‘ఆగడు’ ఫలితం నుంచి పాఠాలు నేర్వకుండా మరోసారి ‘బ్రూస్ లీ’ అంటూ పాత సినిమానే తీసి జనాల నుంచి తిట్లు తీసుకుంటున్న వైట్ల జోలికెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. ఇక మిగతా పెద్ద దర్శకులెవ్వరూ ఖాళీ లేరు. త్రివిక్రమ్ - పూరి - సురేందర్.. అందరూ వాళ్ల వాళ్ల ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. దీంతో అఖిల్ కళ్లు ఇప్పుడు క్రిష్ మీద పడ్డట్లు చెప్పుకుంటున్నారు. ‘కంచె’ మంచి హైప్ మధ్య విడుదలవతున్న నేపథ్యంలో ఆ సినిమా హిట్టయితే అఖిల్.. క్రిష్ తో పని చేసే అవకాశాలు లేకపోలేదు. తొలి సినిమాతో ఎలాగూ మాస్ ఇమేజ్ వచ్చేసింది కాబట్టి.. ఈసారి క్రిష్ లాంటి క్లాస్ డైరెక్టర్ తో అఖిల్ ఓ క్లాస్ సినిమా చేస్తే బాగుంటుందని నాగ్ కూడా ఫీలవుతున్నాడట. ఐతే ‘కంచె’ ఫలితాన్ని బట్టే ఏదైనా ఆధారపడి ఉంటుంది.
Tags:    

Similar News