ఇంగ్లీష్ టైటిల్స్ పై మక్కువ చూపిస్తున్న అక్కినేని హీరోలు..!

Update: 2022-07-10 03:26 GMT
ఒకప్పుడు తెలుగు సినిమాలంటే అచ్చమైన తెలుగు పేర్లనే టైటిల్స్ గా పెట్టేవారు మన ఫిలిం మేకర్స్. హీరోలు కూడా వాటికే మద్దతు తెలిపేవారు. కానీ తర్వాతి రోజుల్లో హిందీ పదాలను.. తెలుగు - ఇంగ్లీష్ పదాల కలయికతో టింగ్లీష్ పదాలను టైటిల్స్ గా పెట్టే ట్రెండ్ మొదలైంది. ఇంటర్నెర్ సోషల్ మీడియా వంటివి అందరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత.. తెలుగు పదాలే అనుకునేంతగా ఆంగ్ల పదాలు మన వాడుక భాషలో భాగమయ్యాయి. దీంతో మేకర్స్ అంతా ఆ వర్డ్స్ నే టైటిల్స్ గా పెడుతున్నారు.

గత దశాబ్ద కాలంలో ఇంగ్లీష్ టైటిల్స్ తో టాలీవుడ్ లో అనేక సినిమాలు వచ్చాయి. పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ మొదలైన తర్వాత యూనివర్సల్ అప్పీల్ కోసం అలాంటి పేర్లనే పెడుతున్నారు. ఈ క్రమంలో కొందరు తమ సినిమాలకు కేవలం ఇంగ్లీష్ లోనే టైటిల్స్ పెడుతూ కనీసం తెలుగు ఫాంట్ లో పోస్టర్స్ కూడా విడుదల చేయడం లేదు. ప్రస్తుతం అనేకమంది హీరోలు తాము నటించే చిత్రాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టుకున్నప్పటికీ.. ప్రస్తుతం అక్కినేని హీరోలు నటిస్తున్న మూడు సినిమాలకు ఆంగ్ల టైటిల్స్ ఉండటం చర్చనీయాంశంగా మారింది.

ఎప్పటికప్పుడు కొత్తదనానికి స్వాగతం పలుకుతూ ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న కింగ్ అక్కినేని నాగార్జున.. ఇంగ్లీష్ టైటిల్స్ తో అనేక సినిమాల్లో నటించారు. 'కిల్లర్' మొదలుకొని 'వైల్డ్ డాగ్' వరకూ ఎన్నో చిత్రాలకు అలాంటి పేర్లు పెట్టారు. ఇప్పుడు నాగ్ ''ది ఘోస్ట్'' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా కిల్లింగ్ మెషిన్ పేరుతో గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అంతేకాదు 'శివ' విడుదలైన అక్టోబర్ 5న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. 'జోష్' తో హీరోగా పరిచయమైన చైతూ.. '100% లవ్' 'లవ్ స్టోరీ' వంటి ఇంగ్లీష్ టైటిల్స్ తో సినిమాలు చేశారు. ఇప్పుడు ''థాంక్యూ'' అంటూ థియేటర్లలోకి రావడానికి రెడీ అయ్యాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 22న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభించింది.

ఇక హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని కూడా ఇంగ్లీష్ టైటిల్స్ విషయంలో తన తండ్రి అన్నయ్యలతో పోటీ పడుతున్నాడు. 'హలో' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అంటూ వచ్చిన యూత్ కింగ్.. ఇప్పుడు ''ఏజెంట్'' అనే సినిమాతో వస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని కోసం అఖిల్ కంప్లీట్ గా మేకోవర్ అయ్యాడు. ఫస్ట్ లుక్ లో కండలు తిరిగిన దేహంతో డిఫరెంట్ లుక్ లో అందరినీ షాక్ అయ్యేలా చేసాడు. మరికొన్ని రోజుల్లో టీజర్ రిలీజ్ కాబోతోంది. అలానే విడుదల తేదీ ప్రకటించనున్నారు.

ఇలా అక్కినేని తండ్రీకొడుకులు 'ది ఘోస్ట్' - 'ఏజెంట్' - 'థాంక్యూ' అంటూ మూడు ఇంగ్లీష్ టైటిల్స్ తో రాబోతున్నారు. అయితే ఇప్పుటి వరకూ ఈ సినిమాల తెలుగు టైటిల్ పోస్టర్స్ ను వదలకపోవడం గమనార్హం. ఆంగ్ల టైటిల్ తోనే చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. దీంతో అసలు ఇవి తెలుగు సినిమాలేనా? లేదా ఇంగ్లీష్ చిత్రాలా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో ఈటీ - బీస్ట్ - డాన్ వంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో పాటుగా ఇతర భాషల్లో రూపొందిన సినిమాలకు కూడా తెలుగులో టైటిల్స్ ఇచ్చారు. కానీ నేరుగా తెలుగులో తెరకెక్కిన చిత్రాలకు మాత్రం మాతృ భాషలో టైటిల్ పోస్టర్స్ లేకపోవడంపై పలువురు భాషాభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు.

ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టినా మల్టీఫ్లెక్స్ మరియు ఏ-సెంటర్ జనాలకు రీచ్ అవుతుంది. కానీ బి సి సెంటర్స్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడానికి తెలుగు పోస్టర్స్ ప్రమోషన్స్ చేయాల్సిన అవరసం ఉంది. మరి అక్కినేని హీరోలు మరియు 'ది ఘోస్ట్' - 'ఏజెంట్' - 'థాంక్యూ' సినిమాల మేకర్స్ ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదో తెలియడం లేదని పలువురు సినీ నిపుణులు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News