40 ఏళ్ళ తరువాత విడుదలకు సిద్ధమైన అక్కినేని సినిమా..!

Update: 2022-11-01 07:36 GMT
లెజండరీ యాక్టర్, ఎవర్ గ్రీన్ అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారు. కొన్ని దశాబ్దాల పాటు సినీ రంగానికి తన సేవలు అందించిన నటసామ్రాట్.. ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.

చివరి రోజుల్లో 'అక్కినేని' ఫ్యామిలీకి చిరస్థాయిగా నిలిచిపోయే 'మనం' సినిమాలో నటించిన ఏఎన్నార్.. బెడ్ మీద ఉండే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు. అయితే ఈ మరపురాని చిత్రం రిలీజ్ అవ్వడానికి నాలుగు నెలల ముందే దిగ్గజ నటుడు 90 ఏళ్ళ వయసులో ఈ లోకాన్ని విడిచిపోయారు.

బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన 'మనం' మూవీ.. ఏఎన్నార్ న‌టించిన చివ‌రి చిత్రంగా రికార్డుల్లో ఎక్కింది. అయితే దివంగత మహానటుడు నాగేశ్వరరావు నటించిన ''ప్రతిబింబాలు'' అనే సినిమా దాదాపు 40 ఏళ్ళ తర్వాత ఇప్పుడు థియేటర్లలో విడుదలకు నోచుకోవడంతో.. ఆయన స్క్రీన్ మీద కనిపించే చివ‌రి చిత్రంగా రికార్డుల‌కెక్కబోతోంది.

ఏఎన్నార్ మరియు సహజనటి జయసుధ జంటగా నటించిన చిత్రం 'ప్రతిబింబాలు'. ఇందులో తులసి మరో కథానాయికగా నటించింది. 1982లోనే పూర్త‌యిన ఈ సినిమా అనివార్య కార‌ణాల వ‌ల్ల అప్ప‌ట్లో విడుద‌ల కాలేదు. ఆ తర్వాత చాలాసార్లు రిలీజ్ చేయడానికి ప్ర‌య‌త్నించినా ఆర్థిక ప‌ర‌మైన లావాదేవీలు సెటిల్ అవ్వ‌క‌పోవ‌డంతో కుద‌ర్లేదు.

అయితే నలభై ఏళ్ళ తరువాత ఏఎన్నార్ సినిమా విడుదలకు సిద్దమైంది. నవంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 250 థియేటర్లలో రిలీజ్ అవుతుందని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో మనం తర్వాత మనం అందరం చూడదగ్గ సినిమా అంటూ పోస్టర్స్ వేసి ప్రచారం చేస్తున్నారు.

'ప్రతిబింబాలు' సినిమా పాత‌దే అయినా.. ఇప్ప‌టి 4K మరియు డీటీఎస్ టెక్నాల‌జీలోకి మార్చి విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌ బృందం తెలిపింది. సెప్టెంబరు 20న అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతిని పురస్కరించుకుని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ.. ఇప్పుడు నవంబర్ లో ముహూర్తం కుదిరింది.

ప్రముఖ దర్శకులు కేఎస్ ప్రకాష్ రావు మరియు సింగీతం శ్రీ‌నివాస‌రావు దర్శకత్వంలో 'ప్రతిబింబాలు' సినిమా రూపొందింది. శ్రీ విష్ణుప్రియ కంబైన్స్ పతాకంపై సీనియర్ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చగా.. వేటూరి సుందరరామ మూర్తి పాటలు రాసారు. ఆచార్య ఆత్రేయ మాటలు అందించారు.

సినిమాల విడుదల ఆలస్యం అవ్వడం మామూలు విషయమే. కొన్ని నెలలో లేదా ఒకటీ రెండేళ్లో లేట్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు 'ప్రతిబింబాలు' సినిమా ఏకంగా 40 ఏళ్ల త‌ర‌వాత రిలీజ్ అవుతోంది. మరి ఈ చిత్రం ఏఎన్నార్ కు ఘనమైన నివాళి అవుతుందేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News