తప్పు జరిగింది.. సారీ

Update: 2021-10-17 10:30 GMT
సినిమాని సినిమాలాగే చూడమంటారు. అయితే అది ఫిక్షనల్ స్టోరీస్‌ విషయంలో చెల్లుతుంది. రియల్ ఇన్సిడెంట్స్‌తోటి, రియల్ హీరోస్ కథలతోటి సినిమాలు తీసేటప్పుడు ప్రతి చిన్న విషయంలోనూ నిజానిజాలు తెలుసుకుని తీయాలి. లోపాలు లేకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. రీసెంట్‌గా అక్షయ్ కుమార్ 'గోర్ఖా' అనే సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ మూవీ పోస్టర్‌‌లో తప్పుండటంతో సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

రియల్ ఇన్సిడెంట్స్తో ఇప్పటికే చాలా సినిమాలు చేశాడు అక్షయ్ కుమార్. ప్యాడ్‌ మేన్, టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్‌కథ, ఎయిర్‌‌లిఫ్ట్, కేసరి, బెల్‌ బాటమ్‌ లాంటివన్నీ ఆ కోవకు చెందిన వే. అవన్నీ విజయం సాధించాయి కూడా. ఇప్పుడు 'గోర్ఖా' అనే మరో  మూవీని అనౌన్స్ చేశాడు. సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ తెరకెక్కించే ఈ చిత్రంలో మేజర్ జనరల్‌ ఇయాన్‌ కార్డొజొ పాత్రలో అక్షయ్ కనిపించబోతున్నాడు. ఇయాన్‌ ఇండియన్ మాజీ ఆర్మీ ఆఫీసర్. గోర్ఖా బెటాలియన్‌లో ఉండేవారు.

1971 ఇండో పాక్ వార్‌‌లో కీలక పాత్ర పోషించారు. ఆ యుద్ధంలో ఓ ల్యాండ్‌మైన్ మీద కాలు వేయడంతో ఆయన కాలు ఛిద్రమైంది. మెడికల్ అసిస్టెన్స్ దొరికే అవకాశం లేకపోవడంతో దగ్గరున్న ఖుక్రీతో తన కాలును తనే కోసేసుకున్నారాయన. అంతటి వీరుడి కథను తెరకెక్కించడం ఆనందంగా ఉందని అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ని విడుదల చేసింది టీమ్. అయితే అందులో తప్పుందంటూ మానిక్‌ ఎం. జాలీ అనే మేజర్‌ కామెంట్ చేశాడు.

పోస్టర్‌‌లో ఇయాన్‌ గెటప్‌లో ఉన్న అక్షయ్‌తో పాటు ఖుక్రీ (కత్తి) కూడా ఉంది. అయితే అది ఖుక్రీలా లేదని, ఖుక్రీకి పదునుగా ఉండే భాగం మరోవైపున ఉంటుందని, ఫొటోలో తప్పుగా ఉందని చెప్పిన జాలీ, అది ఎలా ఉంటుందో చూపించడానికి ఖుక్రీ ఫొటోని కూడా పోస్ట్ చేశాడు. ఓ గ్రేట్ సోల్జర్‌‌పై సినిమా తీయడం ఆనందంగా ఉందని, కానీ తప్పులు జరగకుండా చూసుకోవడం అవసరమని అన్నాడు. దాంతో అక్షయ్ వెంటనే రియాక్టయ్యాడు. తప్పు జరిగినందుకు సారీ చెప్పడంతో పాటు తమ సినిమాలో ఇంకెలాంటి పొరపాట్లు దొర్లకుండా చూసుకుంటామని మాటిచ్చాడు. మరేవైనా విలువైన సలహాలుంటే ఇవ్వమని, తప్పకుండా స్వీకరిస్తామని చెప్పి తన వినయంతో మరోసారి మనసులు దోచుకున్నాడు.

మొత్తానికి బాలీవుడ్‌లో వార్‌‌ డ్రామాల సందడి పెరిగింది. రీసెంట్‌గా కెప్టెన్ విక్రమ్ బాత్రా బయోపిక్‌ 'షేర్‌‌షా' వచ్చింది. విక్రమ్ పాత్రలో సిద్ధార్థ్ మల్హోత్రా నటించాడు. అజయ్ దేవగన్ కూడా 'భుజ్‌'లో స్క్వాడ్రన్ లీడర్‌‌ విజయ్ కర్ణిక్‌ పాత్రలో కనిపించాడు. 'తేజస్‌'లో కంగనా ఎయిర్‌‌ఫోర్స్ పైలట్‌గా కనిపించబోతోంది. 'ఇక్కిస్‌'లో ఆర్మీ లెఫ్టినెంట్ అరుణ్‌ ఖేతర్‌‌పాల్‌గా వరుణ్ ధావన్‌ యాక్ట్ చేస్తున్నాడు. 'శామ్ బహదూర్‌‌'లో శామ్ మానెక్‌షా పాత్రను విక్కీ కౌషల్ పోషిస్తున్నాడు. ఇక సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న హిందీ, తెలుగు బైలింగ్వల్‌ 'మేజర్‌‌'లో అడివి శేష్‌ టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కీ కూడా అలాంటి కథనే ఎంచుకున్నాడు. ఈ దెబ్బతో వార్‌‌ డ్రామాలతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద వార్‌‌ జరగడం ఖాయం.  
Tags:    

Similar News