కరీనా చేసిన తప్పే అలియా చేసిందిగా? బ్రహ్మాస్త్ర గతేమిటో?

Update: 2022-08-24 05:29 GMT
కాలం మారింది. మనం కూడా మారాలి. అలా కాదు.. నేను నా రూట్లోనే ఉంటానంటే.. ఉండండి ఫర్లేదనే రోజులు వచ్చేశాయి. మీడియా సైతం గమ్మున సోషల్ మీడియా బాటలో నడవాల్సిన రోజులు వచ్చేశాయి. తమ వాదనతో సెంటిమెంట్ రాజేసే సామాన్యులు ఇప్పుడు కీరోల్ ప్లే చేస్తారు. ముక్కు ముఖం తెలియకపోవచ్చు కానీ.. వారు పెట్టే పోస్టులు అర్థవంతంగా ఉంటే చాలు.. అదో ఇష్యూగా మారటమే కాదు.. పెద్ద స్థానాల్లో ఉన్న వారికి సైతం నేరుగా సెగ తగిలేలా చేస్తున్న సోషల్ మీడియాను తక్కువగా అంచనా వేస్తే అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన 'బాయ్ కాట్' ఎప్పుడు ఎవరివైపు తిరుగుతుందన్నది ఊహించటానికి వీల్లేని విధంగా మారింది. కోట్లాది రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకుంటూ.. ప్రేక్షకుల అభిమానంతో స్టార్ స్టేటస్ పొందిన నటీనటులు ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలని.. గతంలో మాదిరి తామేం చెబితే.. గుడ్డిగా ఫాలో అయ్యే బ్యాచ్ లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి. గతంలోనా ఇష్టం వచ్చిన సినిమా తీస్తా.. చూస్తే చూడు.. లేదంటే లేదన్న మాట చెప్పేస్తే.. అతగాడికి ఎంత బలుపు అని కొందరు అనుకుంటే.. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడని మరికొందరు అనుకునేవారు.

కానీ.. సోషల్ మీడియా పుణ్యమా అని.. అలా మాట్లాడే వాడి బ్యాక్ గ్రౌండ్.. హిస్టరీ.. అతను అలా అనటానికి కారణం ఏమై ఉంటుందన్న విషయంతో పాటు.. సెంటిమెంట్ రగిలించే వాదనలు సోషల్ మీడియాలో ఎక్కువ అవుతున్నాయి. ఇవి.. జనాల్ని నేరుగా ప్రభావితం చేయటమే కాదు.. వారి చేత తాము అనుకునేలా చేయించగలుగుతున్నాయి. ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చడ్డా విషయంలో అమీర్ ఖాన్ ఎపిసోడ్.. కరీనా కపూర్ చేసిన వ్యాఖ్యలు కలగలపి.. ఆ సినిమాను దారుణంగా దెబ్బేయటమే కాదు.. కలలో కూడా ఊహించని నష్టాల్ని మూట గట్టుకున్న పరిస్థితి.

ఇలాంటి వేళ.. కాస్తంత ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించాల్సింది పోయి.. తాజాగా బ్రహ్మస్త్ర మూవీ విషయంలోనూ అలియాభట్ తాజాగా తప్పు చేసింది. అప్పట్లో కరీనా ఎలా అయితే గీరగా మాట్లాడిందో.. తాజాగా అలియా ఒక ఇంగ్లిష్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఫలానా కుటుంబంలో పుట్టాలని కోరుకొని జన్మించానా? సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుడితే.. అది తొలి సినిమా వరకే ఉపయోగపడుతుంది. అసలు ఆ కుటుంబంలో పుట్టటమే తప్పు ఎలా? మీకు నేను ఇష్టం లేకపోతే నన్ను చూడొద్దు. నేనేమీ చేయలేను' అంటూ నెపోటిజం.. బాయ్ కాట్ ట్రెండ్ పై కాస్తంత ఘాటుగా రియాక్టు అయ్యింది.

అలియా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలోని వారి కొందరు మనోభావాల్ని దెబ్బ తీశాయి. దీంతో.. ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. 'ఆమె కోరికను మనం మన్నిద్దాం. బ్రహ్మాస్త్ర' రూ.500 కోట్ల ప్లాప్ బస్టర్ చేద్దాం. మనం వాళ్లకు టికెట్ల లాంటి వాళ్లం మాత్రమే. వాల్లకు మీ డబ్బులు మాత్రమే కావాలి. మీరు అవసరం లేదు' అంటూ ట్రోల్ చేయటం షురూ చేశారు. అలియా మాటలు బ్రహ్మాస్త్రకు షాకిచ్చేలా మారాయంటున్నారు.ఈ మూవీ మొత్తం మూడు భాగాల్లో రానుండటం.. తొలి భాగం శివను సెప్టెంబరులో విడుదల చేయనుండటం తెలిసిందే.

భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీలో రణ్ బీర్.. అలియా.. నాగార్జున..అమితాబ్ లాంటి భారీ తారాగణం నటిస్తోంది. ఇలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రిలీజ్ అయ్యే వేళలో.. బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న కాలంలో అలియా తొందరపడిందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఆమె చెప్పినట్లే ఇష్టం ఉంటే చూడండి.. లేదన్న మాటకు.. మనం వాళ్లకు టికెట్ల గాళ్లమనే ట్రోలింగ్ టచ్ అయితే.. బ్రహ్మస్త్ర టీం భారీగా మూల్యం చెల్లించక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News