అల్లర్లతో ఇరుక్కుపోయిన ఆలియా

Update: 2017-08-29 05:54 GMT
డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు 20 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించిన సంగతి తెలిసిందే. గుర్మీత్ అరెస్ట్ నుంచి హర్యానా అంతా అల్లర్లతో అట్టుడుకుతుండగా.. డేరా అనుచరుల విధ్వంసాలు ఇంకా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఈ ఉదంతంతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా.. బాలీవుడ్ బ్యూటీ మాత్రం హర్యానాలో ఇరుక్కుపోయింది.

రాజి అనే మూవీ షూటింగ్ కోసం పంజాబ్ లోని పటియాలాకు వెళ్లింది ఆలియా భట్. విక్కీ కౌశల్ తో కలిసి ఆలియా నటిస్తున్న ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ డైరెక్టర్. గుర్మీత్ సింగ్ నేరస్తుడే అంటూ కోర్టు తీర్పు వెలువరించిన ఆగస్ట్ 25న వారు షూటింగ్ స్పాట్ లోనే ఉన్నారు. అయితే.. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే షూటింగ్ కు పేకప్ చెప్పేసి తమ హోటల్ కు చేరుకున్నారు. పంజాబ్.. హర్యానాలలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని పసిగట్టడంతో.. నటీ నటులకు.. అలాగే సినిమా ఎక్విప్మెంట్ కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించడంతో.. సినిమా షూటింగ్ కు ప్యాకప్ చెప్పేసి.. హోటల్ రూంకు చేరిపోయారు.

దాదాపు వారం రోజుల నుంచి అక్కడే ఉంటున్న ఆలియా అండ్ కో.. తిరిగి షూటింగ్ ప్రారంభించడంపై చర్చోపచర్చలు నిర్వహిస్తున్నారు. నిజానికి సెప్టెంబర్ 10 వరకూ వీరి షెడ్యూల్ పటియాలా లోనే జరగాల్సి ఉంది. ఆ తర్వాత చండీఘడ్ వెళ్లి ఓ నెల రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉండగా.. చివరి షెడ్యూల్ ను ముంబైలో ప్లాన్ చేసుకున్నారు. హరీందర్ సిక్కా రాసిన నవల్ సెహ్మత్ ఆధారంగా ఈ రాజి చిత్రం తెరకెక్కుతోంది.


Tags:    

Similar News