ఇదంతా పవన్ సార్ గొప్పతనం: కిన్నెర మొగిలయ్య

Update: 2022-02-03 11:33 GMT
బంగారానికైనా మెరుగుపెట్టాలి .. వజ్రానికైనా సానబెట్టాలి. అలాగే ప్రతిభ ఉన్న కళాకారులకు ఆ ప్రతిభను గుర్తించేవారు కావాలి. అలాంటప్పుడే వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అది మరింతమంది ప్రశంసలతో పాటు పురస్కారాలను సైతం తెస్తుంది. అందుకు నిదర్శనంగా కిన్నెర మొగిలయ్య కనిపిస్తారు.

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం .. అవసలికుంట గ్రామంలో పుట్టిపెరిగిన మొగిలయ్య, తనకి ఊహ తెలిసిన నాటి నుంచి వృత్తి విద్యనే నమ్ముకున్నారు. కిన్నెర మీటుతూ .. పాటలు పాడుతూ బతుకుబండిని నెట్టుకొస్తున్నారు.

ఆయనలో ఉన్న అంకితభావమే ఆయనకి 'భీమ్లా నాయక్' సినిమాలో టైటిల్ సాంగ్ లీడ్ పాడే అవకాశాన్ని తీసుకుని వచ్చింది. పవన్ ప్రశంసలను అందుకున్న ఆయన పదిమంది దృష్టిలో పడ్డారు .. ప్రభుత్వం దృష్టికి వెళ్లారు. అంతరిస్తున్న కళను అట్టిపెట్టుకుని దానిని సంరక్షిస్తూ వచ్చిన ఆయన అంకితభావానికి పద్మశ్రీతో గౌరవం లభించింది. తాజా ఇంటర్వ్యూలో మొగిలయ్య మాట్లాడుతూ .. "పవన్ కల్యాణ్ సార్ అవకాశం ఇవ్వడం వలన నేను ఎవరనేది దేశం మొత్తానికి తెలిసింది. నాతో ఫొటో దిగడానికి ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది వస్తున్నారు.

నేను ఆ పాట పాడిన తరువాత పవన్ సార్ వెంటనే పిలిచి నాకు రెండు లక్షల రూపాయల చెక్ ఇచ్చారు. పవన్ సార్ చేయబట్టే ఇదంతా .. మళ్లీ ఆయనను కలవాలని అనుకుంటున్నాను. ఆయనను కలిసే అవకాశం ఉందని తెలిస్తే చాలు ఇప్పటికిప్పుడు పోతాను. కేసీఆర్ గారిని కలిశాను .. అలాగే పవన్ సార్ ను కూడా కలవాలని అనుకుంటున్నాను. ఆయన సినిమాలో పాడే అవకాశం వచ్చినప్పుడు ఆనందపడ్డానుగానీ .. ఇంతపేరు వస్తుందని అనుకోలేదు. నాకు ఇంతపేరు రావడానికి .. ఇంతమంది నా దగ్గరికి రావడానికి కారణం పవన్ సారే.

నేను ఇంతమందికి తెలియడానికి కారణం నా పాట కాదు .. పవన్ సార్ కి ఉన్న విలువ. అందువల్లనే ఆయన అభిమానులంతా నన్ను ప్రేమిస్తున్నారు. నేను మొన్న 'భీమవరం' పోయాను .. అక్కడ కోడి పందేలు ఆడేవాళ్లంతా నాతో ఫొటో దిగారు .. నన్ను కారు కూడా దిగనీయలేదు. ఇక ఆ తరువాత 'గుంతకల్లు' పోతే, డోలు సన్నాయితో ఎంతో మంచిగా స్వాగతం చెప్పారు. నా మీద పూలు చల్లుతూనే ఉన్నారు. మొన్న హెలికాఫ్టర్ లో ఢిల్లీ తీసుకుపోయారు. అక్కడ స్వాగతం చెప్పిన తీరును నేను మరిచిపోలేను. నిజంగా పవన్ సార్ చాలా మంచోడు .. మళ్లీ కలవాలి .. ఆయనను అడగాల్సినవి చాలా ఉన్నాయి" అంటూ చెప్పుకొచ్చారు.        


Tags:    

Similar News