చిత్ర‌పురి కొత్త అధ్య‌క్షుడిపై కుంప‌టి!

Update: 2019-01-31 04:24 GMT
సినిమా 24 శాఖ‌ల కార్మికుల‌కు చెందిన‌ చిత్ర‌పురి కాల‌నీ చ‌రిత్ర ఎంతో ఉన్న‌త‌మైన‌ది. గుట్ట‌ల్ని.. బండ‌రాళ్ల‌ను కొట్టి .. కార‌డివిని తొల‌గించి ఒక అద్భుత నివాస యోగ్యంగా మార్చ‌డానికి చిత్ర‌పురి క‌మిటీ ఎంతో శ్ర‌మించింది. ప్ర‌ఖ్యాత ఐవీఆర్‌సీఎల్ సంస్థ‌కు కాంట్రాక్టు ఇచ్చి సింగిల్ బెడ్ రూమ్స్, డ‌బుల్ ట్రిపుల్ బెడ్ రూమ్స్ - రోహౌసెస్ - డూప్లెక్స్ హౌసెస్ అంటూ ప‌లు విభాగాల్లో ఇండ్ల‌ను నిర్మించారు. ఇప్ప‌టికే చిత్ర‌పురి సింగిల్ బెడ్ రూమ్స్ పెర్ ఫెక్ట్ ప్లానింగ్ తో నిర్మించి కార్మికుల‌కు అప్ప‌జెప్పారు.

అయితే డ‌బుల్ బెడ్ రూమ్స్ నిర్మాణంలో ఆల‌స్యంపై ఇప్ప‌టికే ప‌లు వివాదాలు ముసురుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇందులో ప‌లు ర‌కాల అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని చాలా కాలంగా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 35 మందికి ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో మెంబ‌ర్ షిప్ ఇవ్వ‌డం.. వారికి డ‌బుల్ బెడ్ రూమ్స్ ఇల్లు కేటాయించ‌డంపై విచార‌ణ సాగింది. గ‌త రెండేళ్లుగా దీనిపై పెద్ద‌లు ప‌రిష్కార మార్గం వెతికే ప్ర‌య‌త్నంలోనూ ఉన్నారు. ఇటీవ‌ల హౌసింగ్ సొసైటీ క‌మీష‌న్ ప‌రిశీల‌న సాగింద‌ని తెలుస్తోంది. అలాగే ఇండ్ల నిర్మాణానికి ఐవీఆర్ సీఎల్ కి 40 కోట్ల మేర‌ అడ్వాన్సులు చెల్లించినా ప‌నులు వేగంగా పూర్త‌వ్వ‌క‌పోవ‌డంపై గ‌డబిడ సాగింది. ఇక క‌మీష‌న్ల క‌క్కుర్తితోనే ఆ అడ్వాన్సులు చెల్లించార‌న్న ప్ర‌చారం సాగింది.

ఇక‌పోతే ఇటీవ‌లే చిత్ర‌పురి  కాల‌నీ అధ్య‌క్షుని మార్పు జ‌రిగింది. ప్రస్తుత అధ్య‌క్షుడిగా ఉన్న కొమ‌ర వెంక‌టేష్ స్థానంలో సీనియ‌ర్ ర‌చ‌యిత ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు అధ్య‌క్షుడు అయ్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న ముందు ఎన్నో స‌వాళ్లు క‌నిపిస్తున్నాయి. ఓవైపు కాల‌నీలో ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఉన్నాయి. మ‌రోవైపు డ‌బుల్ బెడ్ రూమ్స్ కి క్లియ‌రెన్స్ లేక అంత‌కంత‌కు ఆల‌స్యం అవ్వ‌డం స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. క‌మీష‌న్ల క‌క్కుర్తి వ్య‌వ‌హారంలో చిత్ర‌పురి క‌మిటీ పేరు ప్ర‌ముఖంగా వినిపించ‌డంతో ఆ స‌మ‌స్య‌ల్ని చాక‌చ‌క్యంగా ప‌రిష్క‌రించాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు.  చిత్ర‌పురి అధ్య‌క్షుడు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు వీట‌న్నిటినీ ప‌రిష్క‌రించ‌డానికి ఏం చేస్తారో? ఆయ‌న అధ్య‌క్షుడు అయ్యాక ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టారు? అంటూ కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. కాల‌నీలో అంత‌ర్గ‌తంగా ఉన్న ఫిర్యాదుల ప‌రిష్కారానికి ఆయ‌న చొర‌వ తీసుకుంటున్నారా.. లేదా? అన్న సందిగ్ధ‌త వ్య‌క్త‌మ‌వుతోంది. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News