మామా అల్లుళ్ళు కలిసి నటించబోతున్నారా...?

Update: 2020-04-17 14:59 GMT
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కెరీర్లో 152వ చిత్రం 'ఆచార్య'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఆయన మరో సినిమాకు ఓకే చెప్పారు. 'లూసిఫర్' అనే మలయాళ మూవీని చిరు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించింది. దాంతో ఈ సినిమాను చిరంజీవితో తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. కాగా ఆ సినిమా తెలుగు రీమేక్‌కు 'సాహో' డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పారు. తెలుగు వర్షన్‌లో ఇక్కడ నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేస్తూన్నడట సుజీత్.

కాగా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడనేది తాజా సమాచారం. మలయాళ 'లూసిఫర్' సినిమాలో మోహన్ లాల్ కి నమ్మకమైన వ్యక్తిగా ఉండే ఒక పాత్రలో హీరో పృథ్వీరాజ్ నటించాడు. ఆ పాత్ర ఆయనకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అదే పాత్రను తెలుగులో అల్లు అర్జున్ చేస్తే బాగుంటుందని చిరంజీవి భావిస్తున్నాడట. అలాంటి పాత్రకి బన్నీ అయితే న్యాయం జరుగుతుందనే అభిప్రాయం ప్రస్తుతం మెగా క్యాంపులో వినిపిస్తున్న మాట. అల్లు అర్జున్ కూడా ఆ పాత్రను చేయాలనే కోరికతో ఉండటంతో అది సాధ్యం కాబోతున్నదనే మాట వినిపిస్తున్నది. ఇదే నిజమైతే డాడీ తర్వాత ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మామా అల్లుళ్ళ కాంబినేషన్‌ సిల్వర్ స్క్రీన్ పై దుమ్ము దులపడం ఖాయమని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 'ఆచార్య' మూవీ చిత్రీకరణ పూర్తి కాగానే చిరంజీవి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట.
Tags:    

Similar News