బన్నీకి అసలు సిసలు పరీక్ష

Update: 2018-05-04 04:07 GMT
దాదాపు నెల రోజుల వ్యవధిలో మూడు భారీ సినిమాలు విడుదల కావడం.. ఆ మూడు పాజిటివ్ టాక్ తెచ్చుకుని విజయవంతం కావడం అన్నది అరుదైన విషయం. ఆ అరుదైన పరిణామం టాలీవుడ్లో చోటు చేసుకుంటుందేమో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘రంగస్థలం’ భారీ విజయం సాధించింది. ‘భరత్ అనే నేను’ కూడా పర్వాలేదనిపించింది. శుక్రవారం రాబోతున్న ‘నా పేరు సూర్య’ కూడా హిట్టయితే ఇండస్ట్రీకి అంతకంటే ఆనందించే విషయం మరొకటి ఉండదు. సినిమాయేతర అంశాలతో కొంత కాలంగా అట్టుడుకుతున్న ఇండస్ట్రీకి ఇలాంటి విజయాలే అవసరం. ఆల్రెడీ రచ్చ కొంచెం చల్లబడ్డ నేపథ్యంలో ‘నా పేరు సూర్య’ విజయవంతమైతే చర్చలన్నీ ఇటు వైపు మళ్లి ప్రశాంతత చేకూరుతుందని ఆశిస్తున్నారు.

ఐతే ‘నా పేరు సూర్య’కు బాక్సాఫీస్ పరీక్ష కఠినంగానే ఉండబోతోంది. బన్నీ గత సినిమాల తరహాలో ఏదో ఓ మోస్తరు వినోదాన్ని అందిస్తే సరిపోదు. చాన్నాళ్ల పాటు పెద్ద సినిమా లేక ఆవురావురుమని ఉన్న ప్రేక్షకులకు ఆల్రెడీ ‘రంగస్థలం’ కడుపు నింపేసింది. ‘భరత్ అనే నేను’ కిళ్లీ లాగా వచ్చి వాళ్లకు ఆనందాన్నిచ్చింది. ఆ రెండు సినిమాలతో ప్రేక్షకులు బాగానే సంతృప్తి చెందారు. ఇప్పుడు ‘నా పేరు సూర్య’ ఓ మోస్తరుగా నడిపిద్దామనుకుంటే కుదరదు.

ఈ స్థితిలో ప్రేక్షకుల్ని రంజింపజేయాలంటే సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలి. దీని ప్రోమోలు చూస్తే ఏమో ఆ ప్రత్యేకత ఉన్నట్లే కనిపించింది కానీ.. సీరియస్ యాక్షన్ మూవీలా ఉన్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందా.. ‘రంగస్థలం’ కోసం వచ్చినట్లుగా కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుందా.. ‘భరత్ అనే నేను’కు భిన్నంగా రిపీట్ ఆడియన్స్ ను తెచ్చుకుంటుందా అన్నది కీలకం. ఈ విషయాలన్నింట్లోనూ స్కోర్ చేయగలిగితేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. మరి ‘సూర్య’ ఏం చేస్తాడో చూడాలి. గత సినిమాల విషయంలో ఎలాగోలా లాక్కొచ్చేసిన బన్నీకి ఈసారి అలాంటి సౌలభ్యం ఉండకపోవచ్చు. ఆల్రెడీ రెండు భారీ సినిమాలు స్కోర్ చేసిన నేపథ్యంలో బన్నీ ఏదో స్పెషల్ గా చేయాలి. తన ప్రత్యేకతను చాటుకోవాలి.
Tags:    

Similar News