ఏపీ ఆన్ లైన్ సినిమా టిక్కెటింగ్ పోర్టల్ పై అల్లు బాబీ స్పందన..!

Update: 2022-03-30 08:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల అమ్మకాల కోసం ఆన్ లైన్ గేట్ వే తీసుకురానున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం ఈ టికెటింగ్ పోర్టల్ కాంట్రాక్టును మెగా కాంపౌండ్ కు చెందిన ఓ సంస్థకు ఇవ్వనున్నారని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది.

అల్లు అరవింద్ పెద్ద కొడుకు, బన్నీ సోదరుడు అల్లు వెంకటేష్ (బాబీ) కి చెందిన 'జస్ట్ టికెట్' సంస్థ టెండర్ వేసిందని.. ఏపీ సర్కారు ఇదే సంస్థకు ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అప్పజెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా 'గని' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నిర్మాత అల్లు బాబీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్ ను రూపొందించడానికి టెండర్ వేసిన విషయాన్ని ధృవీకరించారు.

గతంలో 'టికెట్ దాదా' అనే ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్ ను రూపొందించామని చెప్పిన బాబీ.. దానిని ఇప్పుడు 'జస్ట్ టిక్కెట్స్' పేరుతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సినిమాలను శాటిలైట్ ద్వారా థియేటర్లకు అందించే క్యూబ్ ను కూడా తానే నడుపుతున్నట్లు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లలో పారదర్శకత తీసుకురావడానికి ఆన్ లైన్ టిక్కెటింగ్ కోసం ఓపెన్ టెండర్లను పిలిచిందని.. అందులో తమ 'జస్ట్ టిక్కెట్స్' సంస్థ కూడా పాల్గొందని అల్లు బాబీ వెల్లడించారు. అయితే రిజల్ట్ ఏంటో ఇంకా తెలియలేదని అన్నారు.

ఆన్ లైన్ టికెట్ పోర్టల్ కోసం టెండర్ వేసినట్లు అల్లు బాబీ స్వయంగా ధృవీకరించడంతో.. జగన్ సర్కారు 'జస్ట్ టికెట్' సంస్థకే ఈ బాధ్యతలను అప్పగించడం దాదాపు ఖాయమైందని అనుకుంటున్నారు.

సినిమా టికెట్ల ఆన్‌ లైన్‌ విక్రయాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆహ్వానించిన ఓపెన్ బిడ్ లో జస్ట్ టికెట్ మాత్రమే తక్కువకు కోట్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అల్లు బాబీ కంపెనీ అందించే సాఫ్ట్ వేర్ టెక్నాలజీ - ఆపరేషన్ ఖర్చుతో ఈ కాంట్రాక్ట్ వచ్చిందే తప్ప.. ప్రభుత్వ పెద్దలతో ఉన్న పరిచయాల వల్ల కాదని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

కాగా, సినిమా టికెట్‌ ధరల నియంత్రణతో పాటు, బ్లాక్‌ టికెట్ల దందాకు చెక్‌ పడనుందని ఆన్ లైన్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైల్వే టికెట్ల బుకింగ్ తరహాలో ఈ సేవలను అందించడం తమ ఉద్దేశ్యమని తెలిపారు.

దీని ప్రకారం ప్రేక్షకులపై ఆన్ లైన్ చార్జీల భారం పడకుండా అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా సినిమా టికెట్లను విక్రయిస్తాయని తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచే ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సినిమా టికెట్ల విక్రయించే సంస్థ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Tags:    

Similar News