తమిళ ఇండస్ట్రీని అంత మాట అనేసిందే..

Update: 2018-10-20 07:03 GMT
మలయాళ కుట్టి అమలా పాల్ కెరీర్ ఆరంభం నుంచి సంచలనాలకు పెట్టింది పేరు. టీనేజీలో ఉండగా మామ-కోడలు మధ్య అక్రమ సంబంధం నేపథ్యంలో నడిచే ‘సింధు సమవేలి’ అనే వివాదాస్పద సినిమాలో నటించి తమిళ జనాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొన్న అమల.. ఆ తర్వాత అద్భుతమైన పాత్రలతో అందరి ప్రశంసలూ అందుకుంది. తనను తిట్టిన నోళ్లతోనే పొగిడేలా చేసుకుంది. చాలా చిన్న వయసులో దర్శకుడు విజయ్‌ ను పెళ్లాడటం.. రెండేళ్లు తిరక్కుండానే అతడి నుంచి విడిపోవడం.. అత్త మామలపై తీవ్ర విమర్శలు చేయడం.. ఇలా అమల ఏం చేసినా సంచలనమే. తాజాగా ఆమె తనకు అవకాశాలిస్తున్న తమిళ సినీ ఇండస్ట్రీ మీదే విమర్శలు గుప్పించింది. కోలీవుడ్ ఒక ఫేక్ ఇండస్ట్రీ అనేసింది. గత ఏడాది విడుదలైన తన సినిమా ‘తిరుట్టు పయలే-2’ ఆశించిన స్థాయిలో ఆడని నేపథ్యంలో అసహనంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.

పుష్కరం కిందట వచ్చిన ‘తిరుట్టు పయలే’కి కొనసాగింపుగా వచ్చిన చిత్రమిది. విలన్.. క్యారెక్టర్ రోల్స్ చేసే బాబీ సింహా హీరోగా నటించాడు. అమల అతడి భార్యగా నటించింది. మంచి థ్రిల్లర్ అయిన ఈ చిత్రం యావరేజ్ గా ఆడింది. ఐతే ఒక పెద్ద హీరో నటించి.. కొంచెం కమర్షియల్ అంశాలుంటే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదని అంటోంది అమల. బాలీవుడ్లో ఇలా హీరో స్థాయి.. కమర్షియల్ అంశాల గురించి పట్టించుకోరని.. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయం సాధిస్తాయని.. తమిళంలో అలా కాదని.. అందుకే ఇది ఫేక్ ఇండస్ట్రీ అని సంచలన వ్యాఖ్యలు చేసింది అమల. ఈ పరిస్థితి మారి.. కంటెంట్ కు విలువ ఇచ్చే పరిస్థితి రావాలని ఆమె అభిప్రాయపడింది. ఐతే సినిమా ఫలితం అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వాళ్లు ఎలాంటి ఫలితం ఇచ్చినా అంగీకరించాల్సిందే తప్ప.. తప్పు వాళ్ల మీద.. పరిశ్రమ మీద నెట్టేయడం సరి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళంలో ఎన్నో చిన్న సినిమాలు సంచలన విజయం సాధించిన చరిత్ర ఉంది. అది తెలుసుకోకుండా అమల తొందరపడి కామెంట్ చేసేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News