అశ్వినీదత్ పెద్ద మనసు చూపించాడు

Update: 2018-05-27 04:25 GMT
ఉదాత్తమైన కథాంశాలతో.. చరిత్రలో గొప్ప వ్యక్తులుగా పేరు పడ్డ వాళ్ల మీద సినిమాలు తీసినపుడు ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపు ఆశిస్తారు ఫిలిం మేకర్స్. గత ఏడాది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి ఇలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇచ్చాయి. అంతకుముందు ‘రుద్రమదేవి’కి తెలంగాణ ప్రభుత్వం ఈ సౌలభ్యం కల్పించింది. కానీ ఏపీ ప్రభుత్వం మినహాయింపు ఇవ్వకపోవడంపై గుణశేఖర్ కినుక వహించాడు. దీనిపై పోరాటం జరిపాడు. ఆ సంగతలా వదిలేస్తే ఇప్పుడు సావిత్రి కథతో తెరకెక్కి అద్భుత విజయాన్నందుకున్న ‘మహానటి’ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చే విషయమై స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆఫర్ ఇవ్వడం విశేషం. ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. తమ సినిమాకు అలాంటి మినహాయింపేమీ వద్దని నిర్మాత అశ్వినీదత్ అన్నారు.

శనివారం ‘మహానటి’ చిత్ర బృందం చంద్రబాబును కలవడం.. ఆయన అందరినీ సత్కరించడం తెలిసిందే. ఐతే అంతకంటే ముందు తెలుగుదేశం సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తే బాగుంటుందని చంద్రబాబుకు సూచించగా.. ఆయన ఆ విషయాన్నే సన్మాన కార్యక్రమంలో ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమ సినిమాకు అలాంటి మినహాయింపేమీ అవసరం లేదని అశ్వినీదత్ ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు. అంతే కాదు.. తమ చిత్ర బృందం తరఫున ఆయన ఏపీ సర్కారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎదురు రూ.50 లక్షలు విరాళం ఇవ్వడం విశేషం. దత్ పెద్ద మనసుపై అందరూ ప్రశంసలు కురిపించారు. ‘మహానటి’ ద్వారా భారీ లాభాలందుకుంటున్న నేపథ్యంలో పన్ను మినహాయింపు కోసం ఆయన ఆశపడకపోవడం మంచి విషయమే.

Tags:    

Similar News