సూర్య సినిమాకు ఈ చిక్కులేంటో?

Update: 2015-04-11 13:30 GMT
దక్షిణాదిన ఏ వివాదాలు లేని హీరోల్లో సూర్య ఒకడు. అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి ఫాలోయింగ్‌ ఉన్న సూర్య వివాదాల జోలికి అస్సలు వెళ్లడు. సూర్యకే కాదు.. అతడి ఫ్యామిలీకి కూడా ఇండస్ట్రీలో చాలా మంచి పేరుంది. ఐతే ఈ మధ్య సూర్య తమ్ముడడు కార్తి చేసిన కొత్త సినిమా కొంబన్‌ విషయంలో పెద్ద వివాదం చెలరేగింది. ఓ వర్గం మనోభావాల్ని దెబ్బతీసే సినిమా ఇదని  విడుదలకు ముందు కొందరు గొడవ చేయగా.. తొలి రోజు సాయంత్రానికి అతి కష్టం మీద సినిమాను విడుదల చేశారు. ఆ వివాదం సద్దుమణిగిందో లేదో.. ఇప్పుడిక సూర్య సినిమాను ఓ వివాదం చుట్టుముట్టింది.

మనం డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో సూర్య 24 అనే సినిమాను అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. టైటిల్‌ను చాలా వెరైటీగా డిజైన్‌ చేసి.. జనాల్ని ఆకట్టుకున్నాడు విక్రమ్‌. ఐతే టైటిల్‌ లోగో బయటికి వచ్చిన నాలుగైదు నెలల తర్వాత షూటింగ్‌ మొదలెడుతున్న సమయంలో ఈ టైటిల్‌ గురించి గొడవ మొదలైంది. అమెరికన్‌ టెలివిజన్‌ సంస్థ 24 పేరుతో ఓ టీవీ షో చేసింది. ఇందులో అనిల్‌ కపూర్‌ది కీలకపాత్ర. ఈ హాలీవుడ్‌ షో.. ఇండియాలో కూడా ప్రసారం చేస్తున్నారు. ఐతే అదే టైటిల్‌ పెట్టి సినిమా తీయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు.. టైటిల్‌ లోగోను కూడా కాపీ కొట్టారంటున్నారు. ఐతే ఆ లోగోకు, ఈ లోగోకు ఏం సంబంధం లేదని రెండూ పక్కనబెట్టి చూస్తే తెలిసిపోతుంది. ఒక టీవీ షోకు పెట్టుకున్న పేరుతో సినిమా తీస్తే వచ్చిన అభ్యంతరం ఏంటో అర్థం కావడం లేదు. అయినా టైటిల్‌ అనౌన్స్‌ చేసిన ఇన్ని నెలల తర్వాత గొడవ చేయడం కూడా విడ్డూరమైన విషయం. సూర్య ఈ వివాదం నుంచి ఎలా బయటపడతాడో చూడాలి.

Tags:    

Similar News