ANR వ‌ర్థంతి: ఎన్న‌టికీ ఒర‌గ‌ని ఏకైక‌ న‌ట‌శిఖ‌రం

Update: 2023-01-22 06:01 GMT
లెజెండ‌రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పరిశ్రమలోని బహుముఖ ప్ర‌జ్ఞావంతుల‌లో ఒకరు. ఆయ‌న‌ శక్తివంతమైన నటన.. స్వ‌చ్ఛ‌త‌..  మనోహరమైన వ్యక్తిత్వం దేశంలోనే అరుదైన‌ సూపర్ స్టార్ గా మార్చింది. అక్కినేని నాగేశ్వరరావును ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ ఆయన అభిమానులు ఏ.ఎన్‌.ఆర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. తెలుగు సినిమా ఎవర్ గ్రీన్ రొమాంటిక్ హీరోగా ఆయ‌న ఒక చ‌రిత్ర‌. ANR 22 జనవరి 2014న హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. అక్కినేని నాగేశ్వరరావు ఎనిమిద‌వ వర్ధంతి (22 జ‌న‌వ‌రిచ 2023) సందర్భంగా ఆయన స్వ‌గ‌తం అలానే తొలి చిత్రం నుండి చివరి సినిమా వరకు ఆస‌క్తిక‌ర‌ ప్రయాణాన్ని ఒకసారి ప‌రిశీలిస్తే..

ఏఎన్నార్ ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా జిల్లా రామాపురంలో జన్మించారు. అక్కడ తన ప్రాథమిక పాఠశాల విద్య తర్వాత 1940 ల ప్రారంభంలో చెన్నైకి వలస వెళ్ళే ముందు థియేటర్ డ్రామాల‌తో అల‌రించారు. 1941 లో `ధర్మపత్ని`తో చలనచిత్ర రంగ ప్రవేశం చేసారు. ఈ సినిమాలో న‌టించేప్పుడు 17 సంవత్సరాల వయస్సు. చిన్న పిల్లాడి పాత్రలో నటించి ఆక‌ట్టుకున్నాడు. `శ్రీ సీతారామ జననం` సినిమాలో శ్రీరామునిగా నటించడం ద్వారా కథానాయకుడిగా మారారు. ఏడు దశాబ్దాల సినీ జీవితంలో ఏఎన్నార్ ఎన్నో బిరుదులు పొందారు. మరెన్నో అవార్డులు అందుకున్నారు. మాయాలోకం (1945) చిత్రంలో ANR ప్రముఖ నటుడు B పద్మనాభంతో స్క్రీన్ స్పేస్ ను పంచుకోవ‌డంతో అశేషంగా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. `ముగ్గురు మరాటీలు` (1946) చిత్రం విజ‌యంతో ఏఎన్నార్ ప్రముఖ స్టార్ ల జాబితాలో చేరారు.

ప్ర‌ముఖ న‌టీమ‌ణులు S. వరలక్ష్మి- భానుమతి రామకృష్ణ- అంజలీ దేవి- లక్ష్మీరాజ్యం- శ్రీరంజని జూనియర్- సావిత్రి- సులోచనా దేవి- జమున త‌దిత‌ర‌ నటీమణులతో అనేక పౌరాణిక చారిత్రక చిత్రాల్లో న‌టించారు. మాయాలోకం- బాలరాజు- కీలు గుర్రం- రక్ష రేఖ- స్వప్న సుందరి- మాయలమారి- మంత్ర దండం వంటి వరుస ఫాంటసీ చిత్రాలను కూడా చేసారు. ఇవి అక్కినేనికి ఇతర పరిశ్రమలలో కూడా ప్రజాదరణను గుర్తింపును అందించాయి. త‌న‌కంటే త‌క్కువ వ‌య‌సు స్టార్ హీరోలు చిరంజీవి- నాగార్జున‌- వెంక‌టేష్ త‌దిత‌రుల‌తో క‌లిసి ఏఎన్నార్ న‌టించారు.

ఆ తర్వాత తన వ‌య‌సు రీత్యా కెరీర్ లో క్యారెక్టర్‌ రోల్స్‌కి మారిన ఆయన శ్రీ రామరాజ్యం- శ్రీరామదాసు- చుక్కల్లో చంద్రుడు- సకుటుంబ సపరివార సమేతం- పెళ్లి సంబంధం- నాన్న నాన్న- పండగ- రాయుడుగారు నాయుడుగారు తదితర చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాదు.. నిర్మాత‌గాను అన్న‌పూర్ణ బ్యాన‌ర్ లో ప్రయోగాలు చేసారు. 2014లో విడుదలైన చివరి చిత్రం `మనం` ఒక ప్ర‌యోగాత్మ‌క చిత్రం. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. అక్కినేని ఫ్యామిలీ స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఏఎన్నార్ న‌ట‌న‌కు అభిమానులు మంత్ర‌ముగ్ధుల‌య్యారు. అప్ప‌టికి క్యాన్స‌ర్ ఉంద‌ని తెలిసినా కానీ మొక్క‌వోని ధీక్ష‌తో ఏఎన్నార్ సెట్స్ లో శ్ర‌మించిన తీరు ఎంద‌రో న‌టీన‌టుల‌కు స్ఫూర్తిగా నిలిచింది.

భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన కృషికిగాను అక్కినేని నాగేశ్వరరావును 1991లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వ‌రించింది. పద్మశ్రీ 1968- పద్మభూషణ్ 1988- పద్మవిభూషణ్ 2011 పుర‌స్కారాల‌తోను సత్కారం అందుకున్నారు. డాక్టర్ చక్రవర్తి- అంతస్తులు- సుడిగుండలు- మేఘసందేశం- బంగారుదేశం వంటి చిత్రాలకు ఏడు నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు. సుడిగుండాలు- మరపురాని మనిషి- ఆత్మబంధువులు- సీతారామయ్య గారి మనవరాలు చిత్రాలకు ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.

ఆయనకు ద‌క్కించుకోన‌ గొప్ప పురస్కారం ఏదైనా ఉందీ అంటే అది `భారతరత్న` మాత్రమే. ఆయ‌న లేక‌పోయినా `నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు`గా ఆయ‌న‌కు ఉన్న గుర్తింపు ఎప్ప‌టికీ చెరిగిపోనిది. ఆ బిరుదును 1957 ఆగస్ట్ లో అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి బెజవాడ గోపాలరెడ్డి చేతుల మీదుగా ఏఎన్నార్ అందుకున్నారు. నట సార్వభౌమ-నట రాజశేఖర-కళాప్రవీణ-అభినయ నవరస సుధాకర-కళా శిరోమణి-అభినయ కళాప్రపూర్ణ-భారతమాత ముద్దుబిడ్డ.. ఇవ‌న్నీ ఆయ‌న అందుకున్న బిరుదులు.

అయితే నటుడిగా క్రియాశీలంగా  ఉన్న ఫేజ్ 1941 నుండి 2014 వ‌ర‌కూ. ఎన్నో ప్ర‌యోగాలు విల‌క్ష‌ణ‌మైన సినిమాల‌తో కెరీర్ ఆద్యంతం ఆయ‌న అభిమానుల‌ను అల‌రించారు. ప్ర‌యోగాత్మ‌క‌ చిత్రాల రూపంలో నేటిత‌రం న‌టీన‌టుల కోసం ఒక అద్భుత నిధిని అందించారు. నేడు అక్కినేని వ‌ర్ధంతి సంద‌ర్భంగా అభిమానులు ప‌లు సేవాకార్య‌క్ర‌మాల‌ను చేస్తూ ఆయ‌న‌ను స్మ‌రించుకుంటున్నారు.
Tags:    

Similar News