ఫస్ట్ లుక్: చెఫ్ గా ఆకట్టుకున్న అందాల అనుష్క శెట్టి..!

Update: 2022-11-07 11:09 GMT
'అరుంధతి' 'రుద్రమదేవి' 'భాగమతి' వంటి సినిమాలతో స్టార్ హీరోల రేంజ్ లో మార్కెట్ ఏర్పరచుకున్న హీరోయిన్ అనుష్క. కొన్నేళ్లపాటు టాలీవుడ్ అగ్ర కథానాయికగా వెలుగొందిన ఈ బ్యూటీ.. ఇటీవల కాలంలో సినిమాలు బాగా తగ్గించేసింది. చివరగా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబడిన 'నిశ్శబ్దం' చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది.

అయితే చాలా గ్యాప్ తర్వాత అనుష్క ఇప్పుడు ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇందులో 'జాతి రత్నాలు' ఫేమ్ నవీన్ పోలిశెట్టితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది స్వీటీ. ఇది ఆమె కెరీర్ లో 48వ చిత్రం.. నవీన్ కు హీరోగా 3వ సినిమా.

తాత్కాలికంగా 'అనుష్క48' నే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికి 'రా రా కృష్ణయ్య' ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 14గా ఈ సినిమా రూపొందుతోంది.

ఈరోజు (నవంబర్ 7) అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఆమె పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో 'అన్విత రవళి శెట్టి' అనే పాత్రలో అందాల అనుష్క నటిస్తున్నట్లు తెలిపారు.

#Anushka48 ఫస్ట్ లుక్ లో అనుష్క ఒక చెఫ్ గా వంట చేస్తూ కనిపిస్తోంది. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్న స్వీటీ.. ఇప్పుడు చాలా స్లిమ్‌ గా మారిపోయింది. అలానే చాలా అందంగానూ ఉంది. ఈ పోస్టర్ లో చెఫ్ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్న ఆమె ముఖం ఎంతో ప్రకాశవంతంగా ఉందని చెప్పాలి.

అనుష్క చెఫ్‌ పాత్రలో నటించడం ఇదే తొలిసారి. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఇప్పటి వరకూ సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్న మేకర్స్.. ఇవాళ స్వీటీ శెట్టి బర్త్ డే స్పెషల్ గా ఆమె ఫస్ట్ లుక్ మరియు పాత్రని పరిచయం చేయడంతో ప్రమోషన్స్ ప్రారంభించారు.

ఇకపోతే అనుష్క శెట్టి మరియు నవీన్ పోలిశెట్టి పేర్లు కలిసొచ్చేలా ఈ చిత్రానికి ''మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి" అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన కంటే వయసులో పెద్దదైన ఓ మహిళ ప్రేమలో పడే కుర్రాడి కథాంశంతో ఈ రొమాంటిక్ డ్రామా రూపొందనుందనే టాక్ కూడా ఉంది.

'అనుష్క48' చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో మేకర్స్ ఇతర వివరాలేమీ వెల్లడించలేదు. త్వరలోనే ఈ సినిమాలో నటించే నటీనటులు - సాంకేతిక నిపుణుల వివరాలతో పాటుగా టైటిల్ ను కూడా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News