హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం

Update: 2021-12-15 10:14 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో పై టాలీవుడ్ లో చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను హైకోర్టు రద్దు చేసింది.

దీంతో కొత్త సినిమాలు విడుదలైన సమయంలో పాత విధానంలో టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు థియేటర్ యజమానులకు అవకాశం కలిగినట్లైంది. రానున్న రోజుల్లో రిలీజ్ అయ్యే పెద్ద చిత్రాలకు ఉపశమనం కలిగిందని ఇండస్ట్రీ జనాలందరూ సంతోషంగా ఉన్నారు.

అయితే వారందరికీ మరోసారి షాక్ ఇస్తూ సినిమా టికెట్ ధరల జీవో నెం.35 రద్దుపై ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజనల్ బెంచిలో అప్పీల్ చేసింది.

దీనిపై ప్రభుత్వ వాదనలు వినాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు. ఈ మేరకు లంచ్ మోషన్ ధాఖలు చేసింది. ఈరోజు ఈ పిటిషన్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు జరగాల్సి ఉంది.

సింగిల్ బెంచ్ తీర్పు కాపీ అందకపోవటంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. రేపు గురువారం సినిమా టికెట్ల రేట్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్స్ తనిఖీకి సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సాయంత్రానికి అన్ని థియేటర్స్ ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది.

కాగా, సామాన్య ప్రజానీకానికి వినోదం తక్కువ ధరలకే అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో గత ఏడాది ఏప్రిల్ లో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను గణనీయంగా తగ్గించింది.

అంతేకాదు సినిమాటోగ్రఫీ చట్టానికి విరుద్ధంగా రోజులో ఎక్కువ షోలు ప్రదర్శిస్తున్నారంటూ.. థియేటర్లో రోజుకు 4 షోలు మాత్రమే వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు - డిస్ట్రిబ్యూటర్లు - ఎగ్జిబిటర్స్ కలిసి టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లారు.

దీనిపై వాదనలు విన్న హైకోర్టు.. ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేస్తూ.. టికెట్ ధరలను పెంచుకునే విధంగా థియేటర్ల యజమానులకు వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. సినిమా వినోదం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని.. ప్రేక్షకులపై భారం మోపకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలపనుంది.

వాదనలు విన్న తర్వాత హైకోర్టు జీవో నెం.35 పై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా సినిమా టికెట్ రేట్ల జరగుతున్న ఈ వ్యవహారం అనేది ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అనుకునే పరిస్థితి వచ్చిందని అనుకోవాలి. మరి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
Tags:    

Similar News