రోబో ఉండగానే.. దాన్ని దించుతున్నాడే

Update: 2018-12-04 11:05 GMT
త్రీడీ సినిమా తాలూకు అనుభూతిని పూర్తిగా ఆస్వాదించాలంటే హాలీవుడ్ సినిమాలే చూడాలంటారు. ‘అవతార్’ లాంటి సినిమాల్ని త్రీడీలో చూస్తే కలిగే అనుభూతే వేరు. అక్కడి బడ్జెట్లు వేరు. ఆ క్వాలిటీ వేరు. త్రీడీ టెక్నాలజీని పరిపూర్ణంగా వినియోగించుకుని ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతారు. ఈ కోవలోనే ‘ఆక్వామన్’ సినిమా అద్భుతమైన త్రీడీ వినోదాన్ని పంచబోతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటిదాకా విడుదలైన దీని ట్రైలర్లు చూసిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద తెరల్లో త్రీడీలో చూసేందుకు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్లో కంటే వారం ముందే ఇండియాలో ఈ చిత్రం సందడి చేయబోతుండటం విశేషం. హిందీతో పాటు తెలుగు.. తమిళ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజవుతోంది.

విశేషం ఏంటంటే.. ఇటీవలే ‘2.0’ను రిలీజ్ చేసిన ఎన్వీ ప్రసాదే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నాడు. హాలీవుడ్ సినిమాల్ని ఫాలో అయ్యే జనాల్లో ‘ఆక్వామన్’పై భారీ అంచనాలున్నాయి. పిల్లలు పెద్ద ఎత్తున ఈ సినిమాకు వెళ్లే అవకాశముంది. అందుకు తగ్గట్లే కొంచెం పెద్ద స్థాయిలోనే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మల్టీప్లెక్సుల్లో ఈ చిత్రానికి భారీగా స్క్రీన్లు కేటాయిస్తున్నారు. ఐతే ‘2.0’ థియేటర్లలో ఉండగా.. ఆ చిత్రాన్ని రిలీజ్ చేసిన ఎన్వీ ప్రసాద్ దానికి పోటీగా ‘ఆక్వామన్’ను దించడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని వల్ల ‘2.0’కు దెబ్బ తగులుతుందేమో అన్న సందేహాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 10-12 శాతం మాత్రమే త్రీడీ తెరలున్నాయి. వాటిలో మెజారిటీ స్క్రీన్లు ‘2.0’కే కేటాయించారు. ఆ చిత్రాన్ని జనాలు 2డీలో చూసేందుకు అస్సలు ఇష్టపడట్లేదు. ఆ స్క్రీన్లు వెలవెలబోతున్నాయి. థియేటర్ల రెంట్లు కూడా వర్కవుట్ కావట్లేదు వీకెండ్ తర్వాత. ఈ నేపథ్యంలో త్రీడీ స్క్రీన్ల నుంచే వచ్చే ఆదాయమే కీలకమవుతోంది. అలాంటిది ఇప్పుడు ఆ స్క్రీన్లను కూడా తగ్గించేసి ‘ఆక్వామన్’కు ఇచ్చేస్తే ‘2.0’కు ఇబ్బందులు తప్పవు. మరి ఎన్వీ ప్రసాద్ ఈ సాహసం ఎందుకు చేస్తున్నట్లో?
Tags:    

Similar News