హిందీపై వ్యతిరేకత.. రెహమాన్ ని బాలీవుడ్ లో బ్యాన్‌ !

Update: 2023-04-27 18:00 GMT
సంగీత దర్శకుడు.. ఆస్కార్‌ అవార్డ్‌ విజేత ఏఆర్‌ రెహమాన్ వివాదంలో చిక్కుకున్నాడు. హిందీ భాషను అవమానించాడు అంటూ ఆయన్ను బాలీవుడ్‌ ప్రేక్షకులు ట్రోల్స్ చేస్తున్నారు. ఉత్తర భారతంకు చెందిన వారు రెహమాన్ ను బాలీవుడ్‌ నుండి బ్యాన్ చేయాల్సిందే అంటూ డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారం ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యల వల్ల ఏర్పడింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల తమిళనాట ఒక అవార్డు ఫంక్షన్ జరిగింది. ఆ అవార్డు ఫంక్షన్ కు రెహమాన్‌ తన భార్య సైరా భాను తో కలిసి హాజరు అయ్యాడు. తాను అవార్డు అందుకున్న తర్వాత స్టేజ్ పైకి వచ్చిన భార్య సైరా భాను తో కూడా రెహమాన్ మాట్లాడించాడు. ఆ సమయంలో ఆమె హిందీలో మాట్లాడుతూ ఉండగా రెహమాన్ అడ్డుకోవడం వివాదాస్పదం అయింది.

సైరా భాను హిందీలో మాట్లాడుతూ ఉంటే నవ్వుకుంటూ ఇక్కడ తమిళంలో మాట్లాడాల్సిందే అంటూ రెహమాన్‌ వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఆమె హిందీలో తన స్పీచ్ ను మొదలు పెట్టి ఆ తర్వాత రెహమాన్ సూచన మేరకు తమిళంలో మాట్లాడటం జరిగింది. తనకు తమిళం సరిగా రాదని.. తప్పులు మాట్లాడి ఉంటే క్షమించాలి అంటూ ఆమె చివర్లో పేర్కొంది.

తన భార్య ను హిందీలో మాట్లాడకుండా తమిళంలో మాట్లాడించి తనకు హిందీ అంటే ఉన్న గౌరవం ను రెహమాన్ చూపించాడు అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు విమర్శించారు. హిందీ భాషను పట్టించుకోని రెహమాన్ హిందీ సినిమాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రెహమాన్ తన భార్యతో సరదాగా చేసిన వ్యాఖ్యలను ఇలా తప్పుపట్టడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. బాలీవుడ్ లో ఇంత మాత్రానికే రెహమాన్ ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏంటో అంటూ రెహమాన్ అభిమానులు కౌంటర్‌ ఇస్తున్నారు.

Similar News