నిజంగా ఈ భారీ ఈవెంట్స్ జనాలను థియేటర్లకు రప్పిస్తున్నాయా..?

Update: 2022-08-03 07:30 GMT
ఎంత పెద్ద సినిమా అయినా.. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన మూవీ అయినా సరే.. దానికి తగ్గట్టుగా పబ్లిసిటీ చేయకపోతే ఫలితం ఉండదనేది వాస్తవం. తాము ఎలాంటి చిత్రంతో రాబోతున్నామనే విషయాన్ని ప్రమోషన్స్ ద్వారా తెలియజెప్తేనే, జనాలు థియేటర్ల వరకూ వస్తారు.

అందులోనూ ఓటీటీలకు అలవాటు పడిపోయిన ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అనేది ఈరోజుల్లో ఫిలిం మేకర్స్ పెద్ద సవాలుగా మారిందని చెప్పాలి. దీని కోసం గతంలో కంటే కాస్త ఎక్కువగానే పబ్లిసిటీ చేయాల్సి వస్తోంది.

ఒకప్పుడు ఆడియో ఫంక్షన్ చేసి.. టీవీ ప్రకటనలు - పేపర్ యాడ్స్ ఇస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇంటర్నెట్ వినియోగం మరియు సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్ లైన్ ప్రమోషన్స్ కు ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది.

ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ - టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ - మేకింగ్ వీడియోలు.. అంటూ రెగ్యులర్ అప్డేట్స్ తో నెట్టింట ట్రెండ్ చేస్తేనే జనాల దృష్టిని ఆకర్షించగలమని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆఫ్ లైన్ ప్రచారానికి విపరీతంగా ఖర్చు చేస్తుండటం కూడా చర్చనీయాంశంగా మారుతోంది.

ఇటీవల కాలంలో కొన్ని సినిమాలకు భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు నిర్వహిస్తుండటం మనం చూశాం. రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ను ఆకట్టుకోవాలి కాబట్టి.. అక్కడొక ఈవెంట్ ఇక్కడొక ఈవెంట్ అనే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. దీని కోసం నిర్మాతలు బాగానే ఖర్చు చేస్తున్నారు.

కాకపోతే ఈ ఎక్స్ట్రా లార్జ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు టీవీలలో వ్యూయర్ షిప్ ను కలిగి ఉన్నాయా? నిజంగా జనాలు ఈ ఈవెంట్స్ చూసి సినిమాలకు రావాలని నిర్ణయించుకుంటారా? అంటే మాత్రం దీనికి సమాధానం లేదు.

ఎందుకంటే ఇటీవల గ్రాండ్ గా ఈవెంట్స్ చేసిన సినిమాలు కొన్ని కనీస ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయాయి. ఫస్ట్ డే షోలు కూడా ఫుల్ అవ్వకపోవడం గమనార్హం. దీన్ని బట్టి భారీ వేడుకలను చూసి జనాలు థియేటర్లకు రావడం లేదని స్పష్టం అవుతుంది.

ఈరోజుల్లో టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ వంటి ప్రమోషనల్ కంటెంట్ ని బట్టే, చాలా వరకు ప్రేక్షకులు సినిమా చూడాలా వద్దా అనేది డిసైడ్ అవుతున్నారని తెలుస్తోంది. ఇక సినిమాలో కంటెంట్ బాగుంటే ఆదరిస్తున్నారు.. బాగలేకపోతే నిర్ధాక్ష్యంగా రిజెక్ట్ చేసేస్తున్నారు.

ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొందరు నిర్మాతలు భారీ ఈవెంట్స్ నే ఐరావతంలాగా భావిస్తున్నారు. కనీసం 30 లక్షల నుండి 40 లక్షలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వేడుకల్లో ఏదైనా అపశృతి జరిగితే అదొక మచ్చగా మిగిలిపోతుంది.

ఏదేమైనా సినిమా ఈవెంట్స్ అనేవి హీరోహీరోయిన్ల అభిమానులను ఉత్సాహపరచడానికి పనికొస్తాయి కానీ.. జనరల్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించేది ప్రమోషనల్ కంటెంటే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి కంటెంట్ తో జనాల దృష్టిని ఆకర్షించాలని సూచిస్తున్నారు.
Tags:    

Similar News