గాన‌గంధ‌ర్వుడి ఘ‌న నివాళికి ఏర్పాట్లు..

Update: 2021-05-30 11:21 GMT
బాల సుబ్ర‌హ్మ‌ణ్యం సుస్వ‌రాల ఝ‌రిలో త‌డిసిపోని తెలుగువారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఆయ‌న గాత్రానికి మైమ‌ర‌చిపోయిన సంగీత ప్రియులు.. ద‌శాబ్దాలపాటు ప‌ర‌వ‌శించిపోయారు. అలాంటి గాన గంధ‌ర్వుడు అంద‌రినీ విషాదంలో ముంచెత్తుతూ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. గ‌తేడాది ఆగస్టు 5న కరోనా వైరస్ బారినపడిన బాలు.. స‌రిగ్గా ఇర‌వై రోజుల‌పాటు కొవిడ్ తో పోరాడి సెప్టెంబర్ 25న తుది శ్వాస విడిచారు.

ఆయ‌న మ‌ర‌ణం ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే.. ఆ స‌మ‌యంలో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో బాలు అంత్య‌క్రియ‌ల‌కు కూడా టాలీవుడ్ నుంచి ఎవ్వ‌రూ హాజ‌రు కాలేదు. ఇక, సంగీత విభాగం నుంచి కూడా బాలుకు నివాళిగా చేసింది ఏమీ లేదు. వివిధ కార్య‌క్ర‌మాల్లో ఆయనను తలుచుకోవడం తప్ప.. ప్ర‌త్యేక‌ కార్య‌క్ర‌మం ఏదీ తీసుకోలేదు. అదే స‌మ‌యంలో.. త‌మిళ‌నాడులో మాత్రం సంతాప కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. దీంతో.. తెలుగు ప‌రిశ్ర‌మ‌పై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో బాలు తొలి జ‌యంతి సంద‌ర్భంగా ఘ‌నంగా నివాళి అర్పించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 4 బాలు బ‌ర్త్ డే. ఆ రోజున ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు నిరంత‌రాయంగా సంగీత విభావ‌రి నిర్వ‌హించబోతున్నారు. ఇందులో.. మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ మొద‌లు.. గాయ‌కులు, గీత ర‌చ‌యిత‌లు, సినీ న‌టులు చాలా మంది పాల్గొన‌బోతున్నారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌బోతున్నారు. బాలు అభిమానులంతా టీవీ ద్వారా తిల‌కించి, బాలు జ‌యంతిలో పాల్గొనాల‌ని కోరుతున్నారు.




Tags:    

Similar News