'వార‌సుడు' వివాదంపై అశ్వ‌నీద‌త్ పంచ్ వేశారుగా!

Update: 2022-11-22 05:45 GMT
త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'వారీసు'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాని 'వార‌సుడు'గా రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. రష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇందు కోసం దిల్ రాజు భారీ స్థాయిలో థియేట‌ర్ల‌ని కూడా బ్లాక్ చేసి పెట్టుకుంటున్నాడ‌నే వార్త‌లు మొద‌ల‌య్యాయి.

అయితే 2023 సంక్రాంతి బ‌రిలో 'వార‌సుడు'కి ముందే వ‌చ్చేస్తున్నామంటూ తెలుగు సినిమాలు ప్ర‌క‌టించేశాయి. చిరు న‌టిస్తున్న 'వాల్తురు వీర‌య్య‌', బాల‌య్య న‌టిస్తున్న 'వీర సింహారెడ్డి' సినిమాల‌ని సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేస్తున్న‌ట్టుగా మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ముందే ప్ర‌క‌టించేశారు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాకు థియేట‌ర్లు కేటాయించిన త‌రువాతే ఇత‌ర డ‌బ్బింగ్ సినిమాల‌కు ప్ర‌ధాన్య‌త నివ్వాలంటూ తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి ఇటీవ‌ల ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

దీనిపై టాలీవుడ్ నిర్మాత‌ల్లోనే భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే అల్లు అర‌వింద్ ఈ వివాదంపై స్పందించిన విష‌యం తెలిసిందే. డ‌బ్బింగ్ సినిమాల రిలీజ్ అని ఆపాల‌నుకోవ‌డం స‌మంజ‌సం కాద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా వుంటే తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి చేసిన ప్ర‌క‌ట‌న‌పై ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుస్వామి తాజాగా నిప్పులు చెరిగిన విష‌యం తెలిసిందే. నిర్మాత‌ల మండ‌లి చేసిన ప్ర‌క‌న‌కే క‌ట్టుబ‌డి వుంటే ప‌రిస్థితులు 'వారీసు'కు ముందు 'వారీసు'కు త‌రువాత సినిమా అనేలా వుంటాయ‌ని హెచ్చ‌రించాడు.

తాజాగా ఈ వివాదంపై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీద‌త్ స్పందించారు. సంక్రాంతికి విడుద‌ల‌య్యే అనువాద చిత్రాల‌కు థియేట‌ర్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వ‌కూడ‌ద‌నే ప్ర‌క‌ట‌న‌ని వెంట‌నే నిర్మాత మండ‌లి ఉప‌సంహ‌రించుకోవాల‌న్నారు. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను త‌ప్పుదోవ స‌ట్టించ‌డంతో పాటు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల‌తో మ‌న‌కున్న అనుబంధాన్ని, మ‌న సినిమాల మార్కెట్ ని దెబ్బ‌తినేలా చేస్తున్నాయ‌న్నారు.

మ‌న సినిమాలు మ‌న ద‌గ్గ‌ర ఎలా ప్ర‌ద‌ర్శితం అవుతున్న‌ప్ప‌టికీ చాలా వ‌ర‌కు అనువాద మార్కెట్‌, ఓటీటీల పుణ్య‌మా అని గ‌ట్టెక్కుతున్నాయి. త‌మిళంలో మ‌న సినిమాలు మంచి వ‌సూళ్ల‌ని సాధిస్తున్నాయి.

ఈ ప‌రిస్థితుల్లో అనువాద చిత్రాల‌కు మ‌నం ప్రాధాన్యం ఇవ్వ‌కూడ‌ద‌ని ఎలా అంటారు. అది ఆత్మ‌హ‌త్యా సాదృశ్య‌మే అవుతుంది. ఒక తెలుగు నిర్మాత‌, తెలుగు ద‌ర్శ‌కుడితో సినిమా చేశారు. దాన్ని సంక్రాంతికి విడుద‌ల చేసుకుంటే త‌ప్పేముంది. మ‌రో నిర్మాత మాత్రం ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ చేసుకోవ‌చ్చా?.. ఈ విష‌యంలో నిర్మాత‌ల మండ‌లి ప్ర‌క‌ట‌న‌ని ఖండిస్తున్నా..' అంటూ చీవాట్లు పెట్టారు. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News