700 కోట్ల సినిమా డిజాస్టర్ అయింది

Update: 2018-07-19 07:36 GMT
చైనా సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతల్ని కుదేలు చేసింది. ఏకంగా 113 మిలియన్ డాలర్లు.. అంటే రూపాయల్లో రూ.700 కోట్లకు పైనే.. ఇదీ ‘అసుర’ అనే సినిమా బడ్జెట్. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం చైనాలో దారుణ ఫలితాన్నందుకుంది. డిజాస్టర్ టాక్‌ తెచ్చుకుని వారం తిరక్కుండానే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఈ సినిమా భరించలేని విధంగా తయారవడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. దీంతో ఎగ్జిబిటర్లే పూనుకుని ఈ చిత్రాన్ని థియేటర్ల నుంచి తీసేశారు. అలీబాబా పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. చైనాలో ఇప్పటిదాకా ఏ సినిమాకూ రూ.400 కోట్ల బడ్జెట్ కూడా దాటలేదు. అలాంటిది ఈ చిత్రంపై ఏకంగా 700 కోట్లు ఖర్చు పెట్టారు.

టిబెటిన్ బుద్దిస్త్‌ ల పౌరాణిక గాథల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్టుల కోసమే వందల కోట్లు ఖర్చు పెట్టారు. భారీ లొకేషన్లలో.. పెద్ద పెద్ద సెట్టింగ్స్ వేసి సినిమా తీశారు. కానీ ఎంత చేస్తే ఏమి.. ఈ సినిమాలో అసలు విషయం కొరవడింది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రాన్ని విమర్శకులు చీల్చి చెండాడారు. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా తిట్టి పోశారు. దీంతో వీకెండ్ అవ్వగానే థియేటర్లు వెలవెలబోయాయి. ఈ చిత్రం ఇప్పటిదాకా 8 మిలియన్ డాలర్లు మాత్రమే  వసూలు చేసింది. వసూళ్లు పుంజుకునే అవకాశం కూడా లేకపోవడంతో ఈ చిత్రాన్ని థియేటర్ల నుంచి తీసేయక తప్పలేదు. చిత్ర నిర్మాతకు 100 మిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. ప్రపంచంలో అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రాల జాబితాలో దీనికి ఐదో స్థానం దక్కడం విశేషం. ఈ చిత్రాన్ని ఆరేళ్ల పాటు చిత్రీకరించడం గమనార్హం.
Tags:    

Similar News