షాకింగ్: జాతీయ చలనచిత్ర అవార్డుల బ‌హిష్క‌ర‌ణ‌!

Update: 2018-05-03 11:19 GMT
భార‌త దేశంలో జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. దేశంలోని అన్ని ఇండ‌స్ట్రీల‌కు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ వారికి సంబంధించి ఉత్తమ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన వారికి కేంద్ర‌ప్ర‌భుత్వం ఈ అవార్డుల‌ను అందిస్తుంది. దీంతో, ఈ జాతీయ అవార్డును పొంద‌డం కోసం సినీవ‌ర్గానికి చెందిన వారు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తుంటారు. దేశ ప్ర‌థ‌మ పౌరుడు రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవ‌డాన్ని అరుదైన గౌర‌వంగా భావిస్తుంటారు. అయితే, నేడు జ‌ర‌గ‌బోతోన్న 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకలపై వివాదం చెల‌రేగింది. నేటి వేడుక‌ల‌లో భాగంగా రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ...కేవ‌లం 11 మందికి మాత్ర‌మే అవార్డులు ప్ర‌దానం చేసేందుకు గంట స‌మ‌యం కేటాయించ‌డంపై పెను దుమారం రేగింది.  

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నేడు 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు జరగనున్నాయి. మొత్తం 140 మంది ఈ అవార్డుల‌ను గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి 60 మంది అవార్డు గ్రహీతలు హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా. ఆన‌వాయితీ ప్ర‌కారం విజేతలందరూ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను స్వీకరించాల్సి ఉంది. అయితే, ఆ అవార్డుల ప్ర‌దానోత్స‌వానికి కోవింద్ కేవలం గంట సమయం మాత్రమే కేటాయించార‌ని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. మిగిలిన వారికి స్మృతీ ఇరానీ చేతులమీదుగా అవార్డులు అందజేస్తామ‌ని  నిర్వాహకులు తెలిపారు. మరోవైపు - వచ్చే ఏడాది నుంచి రాష్ట్రపతి ఒక్క అవార్డు మాత్రమే బహూకరిస్తారని... మిగిలిన అవార్డులను మంత్రులతో ప్రదానం చేయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి కార్యాలయం తెలియజేసింది.  అంతేకాకుండా, ఈ విషయాన్ని చివరి నిమిషంలో బహుమతి గ్రహీతలకు తెలిపారు. ఆ స‌మ‌యంలో కోవింద్ 11 మందికి మాత్ర‌మే మందికి అవార్డులను అందించే అవ‌కాశముండ‌డంతో అవార్డు గ్ర‌హీత‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

దీంతో, అవార్డు గ్ర‌హీత‌లంతా ...అవార్డుల వేడుకను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. గత ఏడాది విజేతలందరికీ అవార్డులను అప్ప‌టి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారని...ఇపుడు అభ్యంతరం ఏమిటని వారు ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై తమ ఆవేదన తెలియజేస్తూ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్‌ కు - రాష్ట్రపతి భవన్ కార్యాలయానికి - సమాచార శాఖ కార్యాలయానికి అవార్డు గ్ర‌హీత‌లు లేఖ రాశారు. 65 ఏళ్ల సంప్రదాయాన్ని తుంగ‌లో తొక్కి వారు తీసుకున్న నిర్ణ‌యం త‌మ‌కు న‌చ్చ‌లేద‌ని తెలిపారు. తాము అవార్డుల ప్రధానోత్సవానికి హాజరుకాదలుచుకోలేదంటూ లేఖలో స్ప‌ష్టం చేశారు. తాము ఉద్దేశ్య‌పూర్వ‌కంగా ఇలా చేయ‌డం లేదని.. తమ మనసులోని ఆవేదన తెలపడానికి ఇలా చేశామని అవార్డు గ్ర‌హీత‌ల‌న్నారు.
Tags:    

Similar News