అప్పటికీ ఇప్పటికి చిరంజీవిలో అదే తపన .. అందుకే మెగాస్టార్ అయ్యారు: బి.గోపాల్

Update: 2021-10-17 10:31 GMT
తెలుగు తెరకి భారీ యాక్షన్ సినిమాలను పరిచయం చేసిన అగ్రదర్శకులలో బి.గోపాల్ ఒకరు. ఇప్పుడున్న సీనియర్  స్టార్ హీరోలకి తమ కెరియర్లో చెప్పుకోదగిన హిట్లు ఇచ్చిన దర్శకుడు ఆయన. ఒక వైపున రాఘవేంద్రరావు .. దాసరి నారాయణరావు, మరో వైపున కోడి రామకృష్ణ - కోదండ రామిరెడ్డి వంటి స్టార్ డైరెక్టర్లు బరిలో ఉండగా, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడిగా బి.గోపాల్  కనిపిస్తారు. తాజా ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ, అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.

"చిరంజీవి గారితో నేను స్టేట్ రౌడీ .. మెకానిక్ అల్లుడు .. ఇంద్ర సినిమాలు చేశాను. అందువలన మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. చిరంజీవి గారి రిసీవింగ్ చాలా బాగుంటుంది .. చాలా ఆప్యాయంగా ఉంటారు. తనకి ఏంకావాలో ఆయనకి బాగా తెలుసు .. దగ్గరుండి చేయించుకోగలరు .. అందరినీ కలుపుకుపోతారు. నేను పెద్ద హీరోని అని అనుకోకుండా అందరితో కలిసి కబుర్లు చెబుతూ భోజనం చేస్తారు. అప్పట్లోనే నేను ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరించేవారు.

తన సినిమా సూపర్ హిట్ కావాలి .. తన సినిమాలో సాంగ్స్ బాగుండాలి .. మూమెంట్స్ బాగుండాలి .. ఫైట్స్ బాగుండాలి .. నిర్మాత బాగుండాలి అనే ఒక తపనను నేను చిరజీవిగారిలో చూశాను. 'స్టేట్ రౌడీ' సినిమా షూటింగు కోసం ఢిల్లీ వెళ్లాము. ఆ సినిమాకి 'తార' మాస్టర్ కొరియోగ్రఫర్ గా ఉన్నారు. తాను డాన్స్ రిహార్సల్స్ చేయాలని చిరంజీవిగారు అన్నారు. ''మీకెందుకు సార్ రిహార్సల్స్  .. ఇలా చెప్పగానే అలా పట్టేస్తారు .. డాన్స్ మాస్టర్ కంటే బ్రహ్మాండంగా చేస్తారు'' అన్నాను.
అయినా వినిపించుకోకుండా ఆయన రిహార్సల్స్ చేశారు. పర్ఫెక్షన్ కోసం ఆయన పడుతున్న తపన చూసి నేను ఆశ్చర్యపోయాను.

ఈ సినిమా కోసం డాన్స్ రిహార్సల్స్ చేద్దామని చిరంజీవిగారు అడిగింది 1988లో. ఆయనతో మళ్లీ నేను 2002లో 'ఇంద్ర' చేశాను. ఆ సినిమాలో పాటలను షూటింగు చేయడానికి స్విట్జర్ ల్యాండ్ వెళ్లాము. 'దాయి దాయి దామ్మా' పాటను చిత్రీకరించవలసి ఉంది. ఆ సాంగ్ కి ముందు కూడా చిరంజీవి రిహార్సల్స్ చేద్దామని చెప్పి .. విపరీతమైన చలిలో ఐదు గంటలపాటు రిహార్సల్స్ చేశారు. 1988నాటికే చిరంజీవి పెద్ద హీరో .. అయినా రిహార్సల్స్  చేద్దామని అడిగారు. ఇక 2002 నాటికి ఆయన మెగాస్టార్ అయ్యారు .. అయినా గతంలో మాదిరిగానే రిహార్సల్స్ చేద్దామని అడిగారు. అప్పటికీ ఇప్పటికీ ఆయనలో అదే తపన చూశాను. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు" అని చెప్పుకొచ్చారు. 
Tags:    

Similar News