అలా చేస్తే బాలకృష్ణకి కోపం వచ్చేస్తుంది

Update: 2021-11-13 11:30 GMT
ఒక వైపున రాఘవేంద్రరావు - దాసరి నారాయణరావు, మరో వైపున కోడి రామకృష్ణ - కోదండరామిరెడ్డి దర్శకులుగా ఒక రేంజ్ లో దూసుకుపోతుంటే, తనదైన ప్రత్యేకతను చాటుతూ నిలబడిన దర్శకుడిగా బి.గోపాల్ కనిపిస్తారు. అప్పట్లో మాస్ యాక్షన్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు.

బాలకృష్ణతో ఆయన చేసిన సినిమాలు చాలావరకూ సంచలన విజయాలను అందుకున్నాయి. లారీ డ్రైవర్ .. రౌడీ ఇన్స్పెక్టర్ .. సమరసింహా రెడ్డి .. నరసింహ నాయుడు వంటి సినిమాలు బాలకృష్ణ కెరియర్లోనే చెప్పుకోదగిన విజయాలు. ఈ సినిమాలన్నీ తెరకెక్కించింది బి.గోపాలే.

తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. " సహజంగానే బాలకృష్ణ గారికి కాస్త కోపం ఎక్కువ అంటారు. నేను ఆయనతో 5 సినిమాలు చేశాను. నిజానికి ఆయన అందరితో చాలా సరదాగా ఉంటారు.

ఉదయం 7 గంటలకు ఆయనకు షాట్ అని చెప్పేసి .. 7:30 .. 8:00 అయినా పట్టించుకోకుండా .. టిఫిన్లు చేస్తూ .. కాఫీలు తాగుతూ .. కబుర్లు చెబుతూ డిలే చేస్తే, అప్పుడు మాత్రం ఆయనకి కోపం వచ్చేస్తుంది. నా వరకూ ఎప్పుడూ కూడా ఆయన విషయంలో ఆలస్యం కాకుండా చూసుకునేవాడిని.

అయితే 'లారీ డ్రైవర్' షూటింగు సమయంలో ఒక సంఘటన జరిగింది .. అప్పుడు కూడా మా సైడ్ నుంచే తప్పుంది. పరిచూరి గోపాలకృష్ణ గారు ఒక వెర్షన్ రాస్తే .. వెంకటేశ్వరరావుగారు వచ్చి కొన్ని సీన్స్ మార్చారు. షూటింగు అయిపోయిన తరువాత గోపాలకృష్ణగారు చూశారు .. తనకి నచ్చలేదని చెప్పారు.

సీరియస్ గా ఉండవలసిన కలెక్టర్ కామెడీ చేస్తే ఆ పాత్ర దెబ్బతింటుందని ఆయన అభ్యంతరం చెప్పారు. దాంతో కొన్ని రీ షూట్లు చేయవలసి వచ్చింది. రీ షూట్లు పెట్టుకున్నప్పుడు బాలయ్య బాబుకి మేము కరెక్టుగా ఎక్స్ ప్లెయిన్ చేయలేదు.

మా మటుకు మేము రీ షూట్లు చేస్తూ పోతున్నాము. అప్పుడు మాత్రం ఆయనకి కోపం వచ్చేసింది. కొన్నిరోజుల పాటు ఆయన అలిగారు. అప్పుడు గోపాలకృష్ణగారో .. ఎవరో జరిగిందేమిటనేది ఆయనకి చెప్పారట. అప్పుడు 'అవునా .. అట్లాగా' అంటూ ఆ తరువాత అర్థం చేసుకున్నారు. ఆ ఒక్క సంఘటన మాత్రం నా సినిమాలకు సంబంధించి జరిగింది.

'లారీ డ్రైవర్' .. 'రౌడీ ఇన్ స్పెక్టర్' రెండూ కూడా హండ్రెడ్ డేస్ ఆడాయి. ఆ తరువాత 'సమరసింహా రెడ్డి' .. 'నరసింహా నాయుడు' రెండూ కూడా హండ్రెడ్ సెంటర్స్ కి పైగా హండ్రెడ్ డేస్ ఆడాయి. అది సామాన్యమైన విషయమేం కాదు గదా" అన్నారు.




Tags:    

Similar News