మహేష్ ఖాతాలో కొత్త బ్రాండ్.. అదిరిపోయే డీల్!
సుంటెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వినూత్న బ్రాండ్ TRUZON SOLARతో భాగస్వామిగా మహేష్ బాబు చేరారు.
సూపర్‌స్టార్ మహేష్ బాబు సినీరంగంతో పాటు, వ్యాపార రంగంలోను రాణిస్తున్న సంగతి తెలిసిందే. అతడు ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఎంబి సినిమాస్ ని ప్రారంభించగా అది దిగ్విజయంగా కొనసాగుతోంది. పలు నగరాల్లో భారీ మల్టీప్లెక్సుల నిర్మాణంలో మహేష్ భాగస్వామిగా ఉన్నారని కథనాలొచ్చాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ మరో కొత్త బ్రాండ్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఇది పర్యావరణ హితమైన సోలార్ పవర్ వృద్ధికి సహకరించనుంది. సుంటెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వినూత్న బ్రాండ్ TRUZON SOLARతో భాగస్వామిగా మహేష్ బాబు చేరారు. ఇకపై అత్యాధునిక పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను అందించే ట్రూజోన్ సోలార్ మిషన్‌ను అతడు ప్రచారం చేయనున్నారు. భారతీయుల భవిష్యత్ క్లీన్ ఎనర్జీ అవసరాల కోసం ఇది సహకరిస్తుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగమైనందుకు మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేసారు.
మంచి భవిష్యత్తును సృష్టించడానికి స్థిరమైన శక్తిని స్వీకరించడం చాలా ముఖ్యం. అందుకే ఇటీవల ఈ బ్రాండ్ ప్రచారానికి మహేష్ ముందుకు వచ్చారు. ఇప్పటికే మొదటి వాణిజ్య ప్రకటనను అతడిపై చిత్రీకరించారు. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ప్రకటన త్వరలో ఎయిర్ కానుంది. అద్భుత సాంకేతికతతో సోలార్ పవర్.. క్లీన్ ఎనర్జీకి మారడానికి దేశంలోని ప్రజల్ని, కమ్యూనిటీలను ప్రేరేపించడమే ఈ ప్రకటన ధ్యేయం.
సూపర్‌స్టార్ ప్రచారంతో సోలార్ పవర్ కి మంచి ఇమేజ్ వస్తుంది. తద్వారా ప్రజల్లోకి వెళ్లడం సులభం. మహేష్ ఛరిష్మాను..పరిశ్రమ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ట్రూజోన్ సోలార్ ప్రతి ఇంటికి చేరువ కావాలని ఆకాంక్షిస్తున్నారు. క్లీన్ అండ్ గ్రీన్! పద్ధతిలో రేపటి భవిష్యత్ కోసం ప్రయత్నమిదని ట్రూజోన్ సోలార్ ప్రతినిధులు చెబుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో భారీ పాన్ ఇండియన్ చిత్రం కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే.