అక్కడ బాహుబలి-2 ఆగిపోయింది

Update: 2017-05-11 10:30 GMT
బాహుబలి: ది కంక్లూజన్ ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. విదేశాల్లో ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధిస్తున్నది అమెరికాలో అయితే.. ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రభంజనం సాగుతున్నది దుబాయిలో. అక్కడ రెండో వారాంతంలో కూడా ‘బాహుబలి-2’ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్లింది. ఐతే అంతా సాఫీగా సాగుతున్న టైంలో అక్కడ ఇప్పుడు బాహుబలి-2కు బ్రేక్ పడింది. సాంకేతిక కారణాల వల్ల గురువారం ఉదయం నుంచి దుబాయ్ అంతటా బాహుబలి-2 షోలు ఆగిపోయాయి. ఒక్క హిందీ వెర్షన్ మాత్రమే దుబాయిలో ప్రదర్శితమవుతోంది. తెలుగు.. తమిళం.. మలయాళ వెర్షన్లకు బ్రేక్ పడింది.

అక్కడి డిస్ట్రిబ్యూటర్ ఈ విషయాన్ని కన్ఫమ్ చేశాడు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మూడు భాషల్లోనూ షోలు ఆపేస్తున్నామని.. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించి యధావిధిగా షోలు రన్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని డిస్ట్రిబ్యూటర్ తెలిపాడు. దీంతో రెండో వారంలో కూడా బాహుబలి-2 చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న జనాలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. మిగతా మూడు భాషల్లో సినిమా ఆగిపోవడం హిందీ వెర్షన్‌ కు కలిసొస్తుందని భావిస్తున్నారు. మరోవైపు అమెరికాలో ‘బాహుబలి-2’ ప్రభంజనం కొనసాగుతోంది. అక్కడ ఈ సినిమా ఇప్పటికే 17 మిలియన్ డాలర్ల మార్కును దాటేయడం విశేషం. యూకేలో సైతం బాహుబలి-2 కళ్లు చెదిరే వసూళ్లు రాబడుతోంది.
Tags:    

Similar News