భాగ్య‌న‌గ‌రం మొత్తం బాహుబ‌లికి దాసోహం

Update: 2017-04-28 03:30 GMT
తెలుగు నేల‌లో సినిమాల‌కు ఉండే ప్రాధాన్య‌మే వేరు. ఈ కార‌ణంతోనే ఓ మోస్త‌రు ఊరు అంటే కూడా నాలుగైదు థియేట‌ర్లు ఉండే ప‌రిస్థితి. ఇక‌.. ప‌ట్ట‌ణాలు.. న‌గ‌రాల్లో థియేట‌ర్లు ఒక మోస్త‌రుగా ఉన్నా.. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో థియేట‌ర్లు ఎంత పెద్ద ఎత్తున ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. సింగిల్ థియేట‌ర్లే కాదు.. మ‌ల్టీఫ్లెక్సుల‌తో న‌గ‌రం న‌లుమూల‌లా థియేట‌ర్ల‌కు కొద‌వ లేని ప‌రిస్థితి.

మిగిలిన చోట్ల థియేట‌ర్లు ర‌క‌ర‌కాల రూపాల్లోకి మారిపోతుంటే.. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో రోజులు గ‌డుస్తున్న‌కొద్దీ.. థియేట‌ర్ల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతున్న ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. భార‌త చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో ఇంత‌కు ముందెన్నెడూ లేని విధంగా బాహుబ‌లికి క్రియేట్ అయిన ఇమేజ్ అంతా ఇంతా కాదు. దేశ విదేశాల‌తో క‌లుపుకొని.. తొమ్మిది వేల స్క్రీన్లలో ఈ మూవీని విడుద‌ల చేస్తున్న‌ట్లుగా బాహుబ‌లి టీం చెబుతోంది.

దీనికి త‌గ్గ‌ట్లే హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేని విధంగా ఒక్క సినిమాతోనే హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలోని థియేట‌ర్లు అన్నీ నిండిపోయాయి. ఇంత పెద్ద మ‌హాన‌గ‌రంలో రెండు అంటే రెండు థియేట‌ర్లు మిన‌హా మిగిలిన అన్నీ థియేట‌ర్ల‌లోనూ బాహుబ‌లి చిత్రాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇలాంటి అరుదైన రికార్డు క‌నుచూపు మేర‌లో మ‌రెవ‌రికీ సాధ్యం కాదేమో. కాచిగూడ లోని ప‌ద్మావ‌తి థియేట‌ర్లోనూ.. ఆర్టీసీక్రాస్‌ రోడ్‌ లోని స‌ప్త‌గిరి థియేట‌ర్ మిన‌హా.. మిగిలిన మ‌హాన‌గ‌రంలోని అన్ని థియేట‌ర్ల‌లోనూ ఈ సినిమానే ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ రెండు థియేట‌ర్ల‌లో ఆడుతున్న రెండు సినిమాల్లో ఒక‌టి బేగంజాన్ కాగా..రెండోది కాంగ్‌. స్క‌ల్ ఐల్యాండ్.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన ప్ర‌త్యేక వెసులుబాటుతో అంద‌రూ ఐదు షోలు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా మొద‌టి షోను ఉద‌యం 7.30 గంట‌ల‌కు వేస్తున్నారు. ఇలా మొద‌లైన బాహుబ‌లి రికార్డుల ప‌ర్వం ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుందో చూడాలి. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News