బాహుబ‌లి.. రోబో-2.. శాత‌క‌ర్ణి.. సేమ్ స్ట్రాట‌జీ

Update: 2016-06-15 17:30 GMT
తెలుగులో బాహుబ‌లిః ది కంక్లూజ‌న్‌.. గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి.. త‌మిళంలో రోబో-2.. వ‌చ్చే ఏడాది విడుద‌ల‌య్యే మోస్ట్ అవైటెడ్-ప్రెస్టీజియ‌స్ మూవీస్ ఇవి. ఈ మూడు సినిమాలకు సంబంధించి చాలా కామ‌న్ పాయింట్స్ క‌నిపిస్తాయి. వీటి మీద అంచ‌నాలు భారీ స్థాయిలో ఉన్నాయి. భారీ బ‌డ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాల చిత్రీక‌ర‌ణ ఎంతో శ్ర‌మ‌తో కూడుకున్న‌ది. ఈ మూడు సినిమాల‌కూ గ్రాఫిక్స్.. వీఎఫెక్స్.. యాక్ష‌న్ సీక్వెన్స్‌.. చాలా కీల‌కం. వీటి కోసం అంత‌ర్జాతీయ నిపుణులు ప‌ని చేస్తున్నారు. ఈ మూడు సినిమాల‌కు సంబంధించిన మ‌రో కామ‌న్ పాయింట్ ఏంటంటే.. వీటి షూటింగ్ స్ట్రాట‌జీ ఒకే ర‌కంగా సాగుతోంది.

ముందు యాక్ష‌న్ దృశ్యాలు.. ప‌తాక స‌న్నివేశాలు పూర్తి చేసేస్తున్నారు. ఆ త‌ర్వాత మామూలు దృశ్యాల‌పై దృష్టిసారిస్తున్నారు. ఈ మ‌ధ్యే మొరాకోలో మొద‌లైన ‘శాత‌క‌ర్ణి’ షూటింగులో ముందు యుద్ధ స‌న్నివేశాలే తీశారు. త‌ర్వాత హైద‌రాబాద్ లో జ‌రిగిన రెండో షెడ్యూల్లోనూ యాక్షన్ సీక్వెన్స్ షూటింగే జ‌రిగింది. మూడో షెడ్యూల్లోనూ యాక్ష‌న్ పార్ట్ మీదే దృష్టిపెడుతున్నారు. మ‌రోవైపు రోబో-2కు సంబంధించి శంక‌ర్‌ అప్ డేట్ ఇస్తూ ఇప్ప‌టిదాకా క్లైమాక్స్‌.. యాక్ష‌న్ సీక్వెన్సే చిత్రీక‌రించామ‌న్నాడు. ఇక ‘బాహుబ‌లిః ది కంక్లూజ‌న్’ క‌థ తెలిసిందే. రెండు చిన్న చిన్న షెడ్యూళ్ల‌లో కొన్ని స‌న్నివేశాలు తీసిన రాజ‌మౌళి ఇటీవ‌లే క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ ఆరంభించాడు. ఈ షెడ్యూల్ 70 రోజుల పాటు సాగుతుంది.

ఈ మూడు సినిమాల ద‌ర్శ‌కులూ ముందు యాక్ష‌న్ స‌న్నివేశాలు తీయ‌డంలో ఓ స్ట్రాట‌జీ ఉంది. ఈ స‌న్నివేశాల‌న్నీ గ్రాఫిక్స్.. వీఎఫెక్ప్ తో ముడిప‌డ్డ‌వి. ఆ ప‌ని పూర్తి కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. వంద‌ల మంది సాంకేతిక నిపుణులు కొన్ని నెల‌ల పాటు వాటి మీద ప‌ని చేయాల్సి ఉంది. అందుకే ముందు ఆ స‌న్నివేశాలు షూట్ చేసి టెక్నీషియ‌న్స్ కు అప్ప‌గించేస్తారు. త‌ర్వాత మిగ‌తా స‌న్నివేశాలు తీస్తుంటే స‌మాంత‌రంగా ఆ ప‌ని కూడా జ‌రిగేలా ప్లాన్ చేశార‌న్న‌మాట‌. దీని వ‌ల్ల షూటింగ్ త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కాకుండా ఉంటాయి. అదీ సంగ‌తి.
Tags:    

Similar News