తెలుగులో ఎన్ని అవార్డుల్ని కైవసం చేసుకుంటుందో తెలియదు కానీ... తమిళం వెర్షన్ కి సంబంధించి ఐఫాలో బాహుబలి అదరగొట్టింది. ఏకంగా ఆరు అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ (ఐఫా) సంస్థ తొలిసారి దక్షిణాదికి సంబంధించిన వేడుకని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఆదివారం ప్రారంభమైన ఐఫా ఉత్సవానికి నాలుగు భాషలకి చెందిన సినీ తారలు హాజరయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో జరుగుతున్న ఈ వేడుక తొలి రోజు బాహుబలి జపం చేసింది. పురస్కారాలు వచ్చిన సమయంలోనే కాకుండా... వక్తల ప్రసంగాల్లోనూ బాహుబలి ప్రస్తావన వచ్చింది. ఒక అద్భుతమైన సినిమాని తీశారని పలువురు కొనియాడారు. ఉత్తమ దర్శకుడు - ఉత్తమ సహాయ నటులు (మేల్ - ఫిమేల్), ఉత్తమ గాయకులు (మేల్ -ఫిమేల్)తోపాటు ఉత్తమ చిత్రంగా కూడా బాహుబలికి పురస్కారాలు దక్కాయి. దీంతోపాటు మలయాళంలో విజయంతమైన ప్రేమమ్ కీ - తమిళంలో విజయవంతమైన తని ఒరువన్ కీ వివిధ విభాగాల్లో పురస్కారాలు లభించాయి. తొలి రోజు వేడుకలో బాహుబలికి సంబంధించిన నృత్య కదంబంతోపాటు - ఆదాశర్మ - తాప్సి - మమతా మోహన్ దాస్ డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫ్యాషన్ డ్రెస్సులతో కథానాయికలు మెరిశారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ చీర సింగారం - తమన్నా గౌను - రెజీనా డ్రెస్సు అందర్నీ ఆకట్టుకొన్నాయి.