దుగ్గిరాల వెళితే... బాహుబ‌లి టికెట్ ఫ్రీ!

Update: 2017-04-27 05:07 GMT
ఇప్పుడు ఎక్క‌డ చూసినా... ఏ వ్య‌క్తిని క‌దిలించినా... ఒకే చ‌ర్చ‌. అదే బాహుబ‌లి-2 చ‌ర్చ‌. రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ చిత్రంపై ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. భార‌త్ వ్యాప్తంగా - ప్ర‌పంచ వ్యాప్తంగా అమితాస‌క్తి వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి ఫీవ‌ర్‌తో జ‌నాలంతా టికెట్ల కోసం సినిమా థియేట‌ర్లు - ఆన్‌ లైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ సైట్ల వెంట ప‌డి తిరుగుతుంటే... ఓ వ్యక్తి మాత్రం ఇదే ఫీవ‌ర్‌ ను త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకునేందుకు ప‌క్కా ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఆ వ్యక్తి ప్లాన్ రెడీ చేసుకోవ‌డ‌మే కాదండి బాబూ... ఏకంగా పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి మ‌రీ జ‌నాన్ని ఊరిస్తున్నారు.

అస‌లు విష‌యం చెప్ప‌కుండా... బాహుబ‌లి డైరెక్ట‌ర్ రాజమౌళి మాదిరి ఈ ఊరించ‌డ‌మేమిట‌నేగా మీ ప్ర‌శ్న‌. అయితే అస‌లు విష‌యంలోకి వ‌చ్చేద్దాం. బాహుబ‌లి-2 చిత్రంపై జ‌నాల్లో నెల‌కొన్న ఆస‌క్తిని త‌న వ్యాపారాన్ని మెరుచుప‌ర‌చుకునేందుకు గుంటూరు జిల్లా దుగ్గిరాల‌లోని గ్యాస్ ఏజెన్సీ డీల‌ర్ గ‌ద్దె శ్రీనివాస్ పక్కా ప్లాన్ వేశారు. సినిమా విడుద‌ల‌కు రెండు,  మూడు రోజుల క్రితం త‌న ప్లాన్‌ను అమ‌లు చేసేందుకు రంగంలోకి దిగిన శ్రీనివాస్‌... దుగ్గిరాల‌లో ఇన్‌ సాన్ గ్యాస్ ఏజెన్సీ పేరిట తాను ఏర్పాటు చేసిన హెచ్‌ పీ గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ క‌నెక్ష‌న్ తీసుకున్న వారికి బాహూబ‌లి-2 చిత్రాన్ని ఫ్రీగా చూపించేస్తాన‌ని ప్ర‌క‌టించేశారు. ప్ర‌క‌టించ‌డంతోనే స‌రిపెట్టుకోని ఆయ‌న‌... బంప‌ర్ ఆఫ‌ర్‌ లాగే క‌నిపిస్తున్న ఈ విష‌యాన్ని దుగ్గిరాల ప‌రిస‌ర ప్ర‌జ‌ల‌కు తెలిసేలా త‌న గ్యాస్ ఏజెన్సీ వ‌ద్ద పెద్ద హోర్డింగుల‌నే ఏర్పాటు  చేశారు.

ఈ నెల 30లోగా త‌న వ‌ద్ద గ్యాస్ క‌నెక్ష‌న్ తీసుకున్న వారికి... దుగ్గిరాల‌తో పాటు ఆ ప‌ట్ట‌ణానికి స‌మీపంలోనే ఉన్న రేవేంద్ర‌పాడులో ఉన్న సినిమా థియేట‌ర్ల‌లో ఆడే బాహుబ‌లి-2 ఆట‌ల‌కు సంబంధించిన టికెట్ల‌ను ఫ్రీగా ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న ఆ హోర్డింగుల్లో పేర్కొన్నారు. ఈ విష‌యం ఆ నోటా, ఈ నోటా ప‌డి చివ‌ర‌కు మీడియా చెవికి కూడా పాకింది. దీంతో ప‌లు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌ల‌న్నీ నేటి త‌మ సంచిక‌ల్లో ఈ విష‌యాన్ని ప్ర‌ధాన శీర్షిక‌త‌ల‌తో పాటు హెర్డింగు ఫొటోల‌ను ప్ర‌ధాన వార్త‌గా ప్ర‌చురించేశాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News