బాహుబలి బెనిఫిట్‌షోలు రచ్చ రచ్చే

Update: 2015-06-30 10:35 GMT
తెలుగులో పెద్ద హీరో సినిమా వచ్చిందంటే చాలు.. థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. ముందు రోజు అర్ధరాత్రి నుంచి హంగామా మొదలైపోతుంది. కొన్ని చోట్ల అర్ధరాత్రి.. ఇంకొన్ని చోట్ల తెల్లవారుజామున బెనిఫిట్‌ షోలు పడిపోతాయి. రాయలసీమ ఏరియాల్లో అయితే స్టార్‌ హీరోల సినిమాలు రిలీజైనపుడు ఫ్యాన్స్‌ కోసం స్పెషల్‌ షోలు వేయడం ముందు నుంచే ఉంది. ఐతే మిగతా ఏరియాల్లో, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ మధ్యే బెనిఫిట్‌ షోల సంస్కృతి పెరుగుతోంది. రెండు మూడేళ్లుగా ఏ పెద్ద హీరో సినిమా విడుదలైనా భ్రమరాంభ, మల్లికార్జున థియేటర్లలో బెనిఫిట్‌ షోలు వేస్తున్నారు. రూ.500-1000 మధ్య రేట్లు పెట్టి టికెట్లు అమ్ముతుండగా అవి పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ లాంటి హీరోల సినిమాలకు టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఈ వ్యవహారమేదో బాగానే ఉందని.. నెమ్మదిగా వేరే థియేటర్లలో కూడా బెనిఫిట్‌షోలు వేస్తున్నారు. ఈ ఏడాది గోపాల గోపాల, టెంపర్‌, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలకు చాలా బెనిఫిట్‌ షోలే పడ్డాయి. ఐతే ఇంకో పది రోజుల్లో బాహుబలి సినిమా విడుదల కాబోతోంది. ఆ సినిమాకున్న క్రేజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలంటే ఆసక్తి లేని వాళ్లు సైతం 'బాహుబలి' చూద్దామనుకుంటుంటే.. ఇక రెగ్యులర్‌గా సినిమాలు చూసే జనాలు, అభిమానుల పరిస్థితెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ల ఆసక్తికి తగ్గట్లే హైదరాబాద్‌లో భారీగా బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇంకా నంబర్‌ క్లారిటీ లేదు కానీ.. చాలా థియేటర్లలో తెల్లవారు జామున బెనిఫిట్‌ షోలు వేస్తారని సమాచారం. ఇందుకోసం పర్మిషన్లు తీసుకునే పనిలో ఉన్నారు థియేటర్ల యజమానులు. టికెట్ల ధరల విషయంలో గత రికార్డులన్నీ బద్దలవడం ఖాయం. హైదరాబాద్‌లో మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా ముందు రోజు అర్ధరాత్రి నుంచే బెనిఫిట్‌ షోల హంగామా ఉండబోతోంది.

Tags:    

Similar News