బాహుబలే టాప్.. బాహుబలే గ్రేటా?

Update: 2017-05-16 09:35 GMT
మంచి సినిమా వేరు.. మంచి కలెక్షన్లు సాధించే సినిమా వేరు. కలెక్షన్లు రాలేదు కాబట్టి మంచి సినిమాను తక్కువ చేయలేం. అలాగే భారీ వసూళ్లు వచ్చినంత మాత్రాన ఏ సినిమా కూడా గొప్పదీ అయిపోదు. ఐతే ‘బాహుబలి’ విషయంలో మాత్రం కలెక్షన్లనే ప్రామాణికంగా తీసుకుని.. తెలుగు సినిమా చరిత్రలోనే కాక ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ ఫిలిం అని మోసేస్తుండటమే కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. ‘బాహుబలి’తో భారతీయ ప్రేక్షకులు ఇంతకుముందెన్నడూ చూడని అద్భుతాల్ని వెండితెరపై రాజమౌళి ఆవిష్కరించిన మాట వాస్తవమే. అవి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచాయి. ఆనందాన్నిచ్చాయి. ఐతే విజువల్ గ్రాండియర్ తో కళ్లు చెదిరిపోయేలా చేసినంత మాత్రాన దాన్ని మించిన గొప్ప సినిమా లేదని అంటే మాత్రం సమంజసం కాదు.

భారతీయ సినీ చరిత్రలో ఎన్నెన్నో గొప్ప సినిమాలున్నాయి. మొత్తం ఇండియన్ సినిమా వరకు ఎందుకు.. తెలుగు వరకే చూసుకుంటే.. పాతాళ భైరవి.. మాయా బజార్.. మిస్సమ్మ.. లవకుశ.. దాన వీర శూర కర్ణ.. శంకరాభరణం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కళాఖండాలు తెలుగు సినిమా కీర్తిని ఇనుమడింపజేశాయి. ఈ మధ్య కాలంలో క్రిష్ తీసిన కంచె.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు కూడా ఈ కోవలోకి వచ్చేవే. ఐతే వసూళ్లలో ఎవ్వరూ అందుకోలేని స్థాయిని అందుకుందని.. వేరే భాషల వాళ్లకూ నచ్చిందని.. ఇలాంటి ప్రమాణాల్ని చూపించి ‘బాహుబలి’నే గొప్ప.. మిగతావన్నీ దాని ముందు దిగదుడుపే అనడం మాత్రం సాహసమే. ‘బాహుబలి’ని ఎంతైనా పొగడొచ్చు కానీ.. దీని ముందు ఏదీ పనికి రాదు.. ఇదే గ్రేట్ అని తీర్మానించడం మాత్రం కరెక్ట్ కాదు. కథాకథనాలు.. నటన.. దర్శకత్వం.. సాంకేతిక సహకారం.. ఇలా ఒక్కొక్కటి తరచి తరచి చూస్తూ వెళ్తే ‘బాహుబలి’ని మించే గొప్ప సినిమాలు తెలుగులో కోకొల్లలు కనిపిస్తాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News