తేడాలొస్తే అమ్మ ఫ్యాన్స్ క్ష‌మించ‌రు!

Update: 2019-03-25 05:05 GMT
బాహుబ‌లి రైట‌ర్ గా విజయేంద్ర ప్ర‌సాద్ పేరు మార్మోగిపోతోంది. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో ఆయ‌న పేరు పాపుల‌రైంది. బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 చిత్రాల‌కు క‌థా ర‌చ‌యిత‌గా పాపుల‌ర‌య్యాక‌, ఆ వెంట‌నే భ‌జ‌రంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రానికి ర‌చ‌యిత‌గా మ‌రోమారు ఓ వెలుగు వెలిగారు. ఇటీవ‌లే రిలీజైన `మ‌ణిక‌ర్ణిక‌- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` చిత్రానికి క‌థ, క‌థ‌నం అందించారాయ‌న‌. ఈ నాలుగు సినిమాలు అత‌డి ఖ్యాతిని జాతీయ‌, అంత‌ర్జాతీయ య‌వ‌నిక‌పైనే విస్త‌రించాయి. విజ‌యేంద్రుని కెరీర్ లో ఇవ‌న్నీ సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన సినిమాలు. అందుకే అత‌డు త‌దుప‌రి ఏ చిత్రానికి క‌థ అందిస్తున్నారు? అన్న క్యూరియాసిటీ అభిమానుల్లో నెల‌కొంది.

స‌రిగ్గా ఇలాంటి టైమ్ లో బాంబ్ లాంటి వార్త ఒకటి రివీలైంది. కంగ‌న టైటిల్ పాత్ర‌లో అమ్మ జ‌య‌ల‌లిత బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నార‌న్న‌ది  ఆ వార్త సారాంశం. నాన్న, మ‌ద‌రాసి ప‌ట్ట‌ణం చిత్రాల ద‌ర్శ‌కుడు ఏ.ఎల్.విజ‌య్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా విజయేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందిస్తున్నారు. విబ్రి మీడియా ఎంట‌ర్‌ టైన్ మెంట్స్ సంస్థ‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే జ‌య‌ల‌లిత జీవితంపై క‌థ రాయ‌డం అంటే ఆషామాషీనా? ఇదే విష‌య‌మై విజ‌యేంద్రుడు ఎంతో ఎల‌ర్ట్‌ గా ఉన్నార‌ట‌.

అమ్మ జీవితం న‌ల్లేరుపై న‌డ‌క కాదు. ఆమె ప‌య‌నంలో ఎన్నో ద‌శ‌లు, ఇంకెన్నో లేయ‌ర్స్ ఉన్నాయి. వివాదాలు ఉన్నాయి. ఏ ద‌శ‌లో క‌థ‌ని ఎంచుకోవాలి అన్న‌ది పెద్ద ఛాలెంజ్. ర‌క‌ర‌కాల ద‌శ‌ల్లో సంఘ‌ట‌న‌ల్ని ఎంతో జాగ్ర‌త్త‌గా వ‌డ‌క‌ట్టి గుది గుచ్చి క‌థ‌ను త‌యారు చేయాల్సి ఉంటుంది. త‌న లైఫ్ లో ఏఏ ఘ‌ట‌న‌ల్ని ఎంచుకోవాలి అన్న‌ది ఎంతో క్లిష్ట‌మైన‌దే. ఏం తేడా వ‌చ్చినా అమ్మ అభిమానులు అస్స‌లు క్ష‌మించ‌రు. జ‌య జీవితం లైవ్ రికార్డెడ్. అందుకే సినిమాటిక్ లిబ‌ర్టీ (స్వేచ్ఛ‌) తీసుకుంటామ‌న్నా కుద‌ర‌దు... అని తెలిపారు. త‌లైవి పేరుతో త‌మిళంలో, జ‌య పేరుతో హిందీలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. తెలుగు వెర్ష‌న్ టైటిల్ నిర్ణ‌యించాల్సి ఉంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ నిర్మాత విష్ణు ఇందూరి ఈ చిత్రానికి పెట్టుబ‌డులు స‌మ‌కూర్చ‌నున్నారు. ఎన్టీఆర్, వైయ‌స్సార్, థాక్రే, మ‌న్మోహ‌న్ వంటి ప్ర‌ముఖుల‌పై బ‌యోపిక్ లు తెర‌కెక్కాయి. ఇప్పుడు జ‌య‌ల‌లిత బ‌యోపిక్, మోదీ బ‌యోపిక్ వేడి పెంచుతున్న సంగ‌తి తెలిసిందే.
    

Tags:    

Similar News