రెహ‌మాన్ ఎవ‌రో నాకు తెలియదు.. నేను ప‌ట్టించుకోను: బాలయ్య

Update: 2021-07-21 06:19 GMT
టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ సినిమాలతోనే కాకుండా.. తన వ్యక్తిత్వంతో వ్యవహార శైలితో చర్చనీయాంశంగా మారుతుంటారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా తన వంతు సేవ చేసే బాలయ్య.. అదే సమయంలో ఫ్యాన్స్ ని లేదా తన అసిస్టెంట్స్ ని కొట్టి వార్తల్లో నిలుస్తుంటారు. మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే బాలయ్య.. దీని కారణంగా అప్పుడప్పుడు ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇటీవల తాను నటించిన 'ఆదిత్య 369' చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా బాలకృష్ణ ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు.

ఇంట‌ర్వ్యూలో భాగంగా 'ఆదిత్య 369' లోని 'జాణ‌వులే నెరజానవులే' పాట గురించి యాంక‌ర్ ప్రస్తావించగా.. బాలకృష్ణ అందుకుని సంగీతం గురించి వివరించారు. ''ఇళ‌య‌రాజా గారి మ్యూజిక్ అద్భుతం. ప్రేక్ష‌కుడిగా, విమ‌ర్శ‌కుడిగా ఒక విషయం చెబుతాను. మీరు గమనించారో లేదో. అది ఇళ‌య‌రాజా గారి మ్యూజిక్ అంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. ఒక్కో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ కి ఒక్కో స్టైల్ ఉంటుంది'' అంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ‌మాన్ పేరు ప్రస్తావించారు బాలయ్య. వెంటనే రెహ‌మాన్ ఎవ‌రో నాకు తెలియదు అనడం గమనార్హం.

''రెహ‌మాన్ ఎవ‌రో నాకు తెలియదు. నేను ప‌ట్టించుకోను. ప‌దేళ్ల‌కు ఓ హిట్ ఇస్తాడు. ఆస్కార్ అవార్డ్.. అందుకే 'భార‌త‌ర‌త్న' అంటే రామారావు చెప్పుతో స‌మానం.. కాలి గోటితో స‌మానం అన్నాను చివ‌రికి. ఇచ్చినోళ్ల‌కు గౌర‌వం కానీ.. ఆయ‌న‌కు గౌరవం ఏంటి? పదవులకు ఆయన అలంకారం ఏమో కానీ.. ఆయనకు పదవులు ఎప్పుడూ అలంకారం కాదు అని అన్నాను. ఒక్కొక్కరికి ఒక స్టాంప్ ఉంటుంది. ఇది మణిశర్మ.. అది దేవిశ్రీప్రసాద్.. ఇది థమన్ అని చెప్పొచ్చు. కానీ 'ఆదిత్య 369' లో ఇళయరాజా సంగీత పోకడ ఎక్కడా కనిపించదు'' అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

అయితే బాలయ్య చెప్పిన మాటలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఎవరికీ అంతుపట్టకుండా ఉన్నాయి. ఇళ‌య‌రాజా గురించి మాట్లాడుతూ మధ్యలోకి రెహ‌మాన్‌ ని ఎందుకు తీసుకొచ్చారో.. మళ్ళీ ఆయన ఎవరో తెలియదని కామెంట్స్ ఎందుకు చేశారో.. ఈ క్రమంలో రామారావుని గుర్తు చేసుకొని 'భారతరత్న' ఆయన చెప్పుతో కాలి గోటితో సమానమని ఎందుకు అన్నారో అర్థం కావడం లేదని నెటిజన్స్ అంటున్నారు.

ఇంతకముందు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా దేశ అత్యున్నత పురస్కారమైన 'భారతరత్న' గురించి అగౌరవంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అప్పుడే బాలయ్య వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని గుర్తు చేయడం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బాలకృష్ణ అనాలోచితంగా అన్నాడో కావాలనే అన్నాడో తెలియదు కానీ.. నందమూరి తారక రామారావు కు 'భారత రత్న' ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. రెండు సార్లు దేశ అత్యున్నత పురిష్కారం పట్ల అభ్యంతర వ్యాఖ్యలు చేశారనేది స్పష్టం అవుతోంది.

ఇదిలా ఉండగా బాలయ్య ఈ ఇంటర్వ్యూ సందర్భంగా 'ఆదిత్య‌ 369' కు సీక్వెల్ గా 'ఆదిత్య 999 మాక్స్' సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. సీక్వెల్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయ‌ని.. ఈ సినిమా ద్వారా తన త‌న‌యుడు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని మ‌రోసారి గుర్తు చేశారు. ‘ఆదిత్య 999 మాక్స్‌’ చిత్రాన్ని 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని బాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా తన తదుపరి సినిమాలపై క్లారిటీ ఇచ్చారు. 'అఖండ' - గోపీచంద్ మలినేని సినిమాల తర్వాత అనిల్ రావిపూడి - సితార ఎంటర్టైన్మెంట్స్ - పూరీ జగన్నాథ్ లతో సినిమాలు చేయాల్సి ఉందని నటసింహం తెలిపారు.

Tags:    

Similar News