'అఖండ' విజయం అందరిదీ

Update: 2021-12-03 04:30 GMT
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన 'అఖండ' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్లో బాలకృష్ణ మాట్లాడారు.

"చాలా సంతోషంగా .. పరమానందంగా ఉంది. 'అఖండ' సినిమాను అద్భుతంగా చెక్కిన శిల్పి మన దర్శకుడు బోయపాటి శ్రీను గారు. ఈ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకనాడు రామారావుగారు భక్తిని బ్రతికించారు. ఈనాడు ఈ సినిమా భక్తిని బ్రతికించింది అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది .. ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాకి ఇంతటి అఖండ విజయాన్ని అందించిన ప్రేక్ష దేవుళ్లకు .. నా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకత ఉంది. కొత్తదనాన్ని వాళ్లు ఎప్పుడూ ఆదరిస్తారనడానికి నిదర్శనం 'అఖండ' సినిమా.

భయంకరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ, చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కేవలం మా విజయం అనుకోవడం లేదు. చలనచిత్ర పరిశ్రమ విజయం.

ఈ సినిమాను మేము పూర్తి చేయడానికి 21 నెలలు పట్టింది. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. ఈ సినిమాతో చరిత్రలో నిలిచిపోతామనే ధృడ సంకల్పంతో పనిచేశారు. దాని ఫలితమే ఈ రోజున 'అఖండ' సాధించిన ఈ విజయం.

నాకు కాస్త ఆధ్యాత్మికత ఎక్కువ .. అందుకే బోయపాటి ఈ సినిమాను నాతో ప్లాన్ చేశాడేమో. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు .. శంఖంలో పోయనిదే తీర్థం కాదు .. అలాంటిదే ఈ అఖండ. చరిత్ర సృష్టించాలన్నా మేమే .. దానిని తిరగరాయాలన్నా మేమే. ముందు తరాలవారికి భక్తి అంటే ఏమిటనేది ఈ సినిమా చెబుతుంది.

ఈ సినిమా చూస్తున్నప్పుడు తెరమీద కనిపించేది నేనేనా అనిపించింది. తమన్ గారు ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించడం జరిగింది. ఈ సినిమాకి అన్నీ సమపాళ్లలో కుదిరాయి .. అందుకే ఇంతటి విజయాన్ని సాధించింది. అందుకు కారణమైన ప్రేక్షక దేవుళ్లకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News