‘శాతకర్ణి’లో ఆ లోపాన్ని ఒప్పుకున్న బాలయ్య

Update: 2017-01-16 10:37 GMT
సంక్రాంతి కానుకగా విడుదలైన నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అంచనాల్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది. ఐతే సినిమా గురించి అందరూ గొప్పగా మాట్లాడారు కానీ.. ఒక విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో యుద్ధాలు తప్ప కథేమీ పెద్దగా లేదన్నారు. శాతకర్ణి చేసిన యుద్ధాల వరుస క్రమాన్ని చూపించారు తప్ప.. ఆయన పాలన గురించి కానీ.. వేరే కోణాల్ని కానీ క్రిష్ చూపించలేకపోయాడన్న విమర్శ వినిపించింది. తన ప్రతి సినిమాలోనూ ఎమోషన్ల మీద బాగా దృష్టి పెడుతూ.. కథను బలంగా చెప్పాలని చూసే క్రిష్.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో మాత్రం ఆ విషయంలో నిరాశ పరిచాడనే చెప్పాలి.

ఈ విషయంలో క్రిష్ స్పందన ఏమో కానీ.. హీరో బాలకృష్ణ మాత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో లోపాన్ని ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో గొప్ప కథేమీ లేదన్నాడు. ‘‘గౌతమీపుత్ర శాతకర్ణిలో సరైన కథ లేదన్నది వాస్తవమే. అయినప్పటికీ ఉన్నంతలో శాతకర్ణి గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేశాం. జనాలు ఇలాంటి చారిత్రక కథతో ఇంకో సినిమా చేయమంటున్నారు. కానీ అందుకు తగ్గ సరైన స్క్రిప్టు ఎక్కడుంది’’ అని బాలయ్య ప్రశ్నించాడు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో ఉన్న లోపం గురించి బాలయ్య నిజాయితీగా ఒప్పుకోవడం విశేషమే. సినిమాలో ఇంకొంచెం కథ ఉండి.. శాతకర్ణిలోని మిగతా కోణాల గురించి కూడా సరిగ్గా చెప్పి ఉంటే.. ఈ చిత్ర స్థాయి మరింత పెరిగేదనడంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News